Video Viral: పిచ్చి పీక్స్.. పులితో సెల్ఫీ..
Viral Video : కొందరు యువకుల సెల్ఫీల పిచ్చి పరాకాష్టకు చేరుతుంది. ఈ క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని ఫొటోలు తీసేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో నలుగురు వ్యక్తులు అటవీ ప్రాంతంలో రహదారిపై వెళ్తుండగా.. అదే సమయంలో అడవిలో నుంచి రోడ్డుకు దగ్గరగా వస్తున్న ఓ పెద్ద పులి వారికి తారస పడింది. అది చూసిన యువకులు వీడియోలు, ఫోటోలు తీస్తూ పులికి దగ్గరగా వెళ్లారు. అంతటితో ఆగకుండా ఓ యువకుడు ఏకంగా పులితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు ఆ పులి యువకులను పట్టించుకోకుండా వెళ్లిపోయింది.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ఒకరు ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడొద్దని కోరారు. యువకుల తీరును తప్పుబట్టారు. వీడియో చూసిన నెటిజన్లు యువకులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com