Viral News : బిల్డింగ్ పై నుంచి విద్యార్థిని వేలాడదీసిన ప్రిన్సిపాల్.. దీంతో ఆ పిల్లాడు..

Viral News : అందరు విద్యార్థులూ ఒకేలా ఉండరు. కొందరు గడుగ్గాయిలు ఉంటే.. మరికొందరు తుంటరివాళ్లు ఉంటారు. మరికొందరు నెమ్మదస్తులు కనిపిస్తారు. అలాగని... అందరూ బుద్ధిగా ఉంటారనుకుంటే ఎలా? అందరినీ ప్రేమగా చూస్తూ.. వారికి చదువు చెప్పాల్సిన బాధ్యత గురువులదే. వారిని నయానో, భయానో దారికి తెమ్మంటే అర్థం.. ఆ పిల్లలను మృత్యుముఖం వరకు తీసుకెళ్లమని కాదు. కానీ ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ ప్రిన్సిపాల్ ఇలాగే చేశాడు.
పిల్లాడికి కాస్త బుద్ది చెప్పండి అని తల్లిదండ్రులు అన్నారు అంటే దానర్థం.. కాస్త గట్టిగా మందలించమని. అంతేకాని చావు అంటే ఎలా ఉంటుందో.. చూపించమని కాదు. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ ప్రాంతంలో చదువుతున్న సోనూ యాదవ్ అనే రెండో తరగతి విద్యార్థిపై ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ విశ్వకర్మ దారుణంగా ప్రవర్తించాడు. సోనూ యాదవ్.. లంచ్ బ్రేక్ సమయంలో కొంతమంది విద్యార్థులను కొరికినట్లు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు అందింది. దీంతో ఆయన సోనూ కాలు పట్టుకొని లాక్కొచ్చి.. క్షమాపణ చెప్పమన్నాడు. లేకపోతే బిల్డింగ్ పై నుంచి పడేస్తానని బెదిరించాడు.
ప్రిన్సిపాల్ తిట్టారంటే ఏ స్టూడెంట్ అయినా భయపడతాడు. ఆ భయంతో క్షమాపణ చెప్పాలన్న సంగతిని కూడా గుర్తుంచుకోలేరు. అయినా ఆ కుర్రాడు చదువుతున్నది కూడా కేవలం రెండో తరగతే. కానీ ఈలోపే ప్రిన్సిపాల్ మనోజ్.. సోనూ కాలు పట్టుకుని బిల్డింగ్ పైనుంచి వేలాడదీశాడు. దీంతో సోనూకి పై ప్రాణాలు పైనే పోయాయి. ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టాడు. దీంతో ఇతర విద్యార్థులతోపాటు టీచర్లు కూడా అక్కడికి పరిగెట్టుకొచ్చారు. మనోజ్ ను వారించి.. సోనూను ఆయన నుంచి విడిపించారు. కాకపోతే ఈ తతంగాన్నంతా కొంతమంది టీచర్లు వీడియో కూడా తీశారు. ఇప్పుడది వైరల్ గా మారింది.
ఇంటికి వెళ్లిన తరువాత సోనూ... తన తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద మనోజ్ పై కేసు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. సోనూ తండ్రి చెప్పడం వల్లే తాను ఆ పిల్లాడికి బుద్ధి చెప్పడానికి అలా చేశానని మనోజ్ చెప్పాడు. అయినా సరే.. పిల్లలపై అంత క్రూరంగా ప్రవర్తించడం అస్సలు మంచిది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com