Will Smith: ఆస్కార్ వేదికపై షాకింగ్ ఘటన.. స్టేజ్‌పైనే కమెడియన్‌పై చేయి చేసుకున్న విల్ స్మిత్..
Will Smith: హాలీవుడ్ సూపర్ స్టార్, ఈ ఏడాది ఆస్కార్ విన్నర్ 'విల్ స్మిత్' కోపాన్ని ఆపుకోలేకపోయాడు. 2022 అకాడమీ అవార్డ్స్‌లో.. 'కింగ్ రిచర్డ్' సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోవడానికి కొన్ని క్షణాల ముందు.. అదే ఆస్కార్ వేదికపై మరో నటుడు క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు. తన భార్య జాడా పింకెట్ స్మిత్‌పై క్రిస్ వేసిన జోక్‌ను తేలిగ్గా తీసుకోలేక.. ఆవేశానికిలోనై స్టేజ్‌పైకి వెళ్లి మరీ క్రిస్‌రాక్‌కు ఒక్కటిచ్చాడు. ఈ ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది.
2022కి సంబంధించిన 94వ అకాడమీ పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా బెస్ట్ డాక్యుమెంటరీగా 'సమ్మర్ ఆఫ్ సోల్'కి అవార్డ్ ప్రకటించేందుకు స్టేజ్‌పైకి వెళ్లాడు కామెడీ స్టార్ క్రిస్ రాక్. ఈ సందర్భంగా గుండుతో కనిపిస్తున్న విల్ స్మిత్ భార్య- జాడా పింకెట్ స్మిత్ లుక్‌పై కామెంట్ చేసాడు. అలోపేసియా అనే వ్యాధి కారణంగా తన భార్యకు జుట్టు ఊడిపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితిపై జోక్ వేయడాన్ని సీరియస్‌గా తీసుకుని స్మిత్ ఇలా రియాక్ట్ అయ్యాడు.
GI జేన్ సినిమాను ఉదాహరిస్తూ వేసిన జోకులు ఆపాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. నీ నోట్లోంచి మళ్లీ నా భార్య పేరు రానీయకు అంటూ చెప్పదెబ్బ తర్వాత వార్నింగ్ ఇచ్చాడు. ఆడియన్స్‌లోకి వచ్చి కూర్చున్నాక కూడా తన కోపాన్ని ఆపుకోలేక గట్టిగానే తిట్టాడు. ఐతే.. ఇదంతా స్క్రిప్ట్‌లో భాగమా అని కొందరు తేలిగ్గానే తీసుకున్నా.. కాసేపటికి అందరికీ విషయం అర్థమైంది.
ఈ ఘటన జరిగిన కాసేపటికి 'కింగ్ రిచర్డ్' సినిమాకి బెస్ట్ యాక్టర్‌గా విల్ స్మిత్ పేరు ప్రకటించడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. కెరీర్‌లో తొలి ఆస్కార్ అందుకున్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. 2001లో, 2006లో ఆస్కార్‌కి విల్ స్మిత్ సినిమాలు నామినేట్ అయినా పురస్కారం దక్కలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అకాడమీ అవార్డు అందుకున్న సంతోషంలో కన్నీరు పెట్టాడు.
టెన్నిస్ స్టార్స్ వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్ తండ్రి అయిన రిచర్డ్ విలియమ్స్ బయోగ్రఫీ ఆధారంగా తీసిన 'కింగ్ రిచర్డ్'లో అద్భుతమైన నటనకు విల్‌స్మిత్‌కి ఈ అవార్డ్ దక్కింది. పురస్కారం అందుకున్నాక.. అంతకుముందు చెంప దెబ్బ కొట్టినందుకు క్షమాపణ చెప్పాడు. చెమ్మగిల్లిన కళ్లతోనే జరిగినదానికి సారీ చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com