Viral News: వైరల్ అవుతున్న చిత్రం.. జీవితం మెరుగ్గా ఉండబోతోందన్న ఆశాభావం

Viral News: వైరల్ అవుతున్న చిత్రం.. జీవితం మెరుగ్గా ఉండబోతోందన్న ఆశాభావం
X
Viral News: లక్నోలో బురఖా ధరించిన మహిళ, స్విగ్గీ బ్యాక్‌ప్యాక్‌తో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను ఎవరో క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Viral News: లక్నోలో బురఖా ధరించిన మహిళ, స్విగ్గీ బ్యాక్‌ప్యాక్‌తో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను ఎవరో క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. నెటిజన్లు మూస పద్ధతులకు స్వస్తి చెప్పిన మహిళను ప్రశంసించడం ప్రారంభించారు. అయితే, ఫోటో వెనుక నుంచి తీయడంతోపాటు ఆమె ఎవరనేది గుర్తించడం కష్టంగా మారింది. కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదు.. మొత్తానికి ఆమెని గుర్తించారు.



ఆ మహిళ 40 ఏళ్ల రిజ్వానా అని, ఆమె ఫుడ్ డెలివరీ ఏజెంట్ కాదని, మెయిడ్‌గా పనులు నిర్వర్తిస్తుంటుంది అని తెలుసుకున్నారు. ఆమెను కలిసి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు.



"నేను ఉదయం మరియు సాయంత్రం ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తాను. నెలకు రూ.1,500 సంపాదిస్తుంటాను. నేను హాకర్‌గా కూడా పని చేస్తాను. మధ్యాహ్నం మార్కెట్‌‌కు వెళ్లి చిన్న చిన్నవ్యాపారాలు చేస్తుంటాను. స్టాల్స్‌లో డిస్పోజబుల్ గ్లాసులు విక్రయిస్తుంటాను. మొత్తం మీద నెలకు రూ.5,000-రూ.6,000 సంపాదిస్తుంటాను. నా వంటగదిలో పొయ్యి వెలగాలంటే నేను కష్టపడాలి అని రిజ్వానా చెప్పింది. మనసున్న దాతలు ఎవరైనా సాయం చేస్తే ఆమె జీవితం మారుతుంది.






రిజ్వానాకు నలుగురు పిల్లలు.. పెద్ద కూతురు 22 ఏళ్ల లుబ్నాకు పెళ్లయ్యింది. అత్తమామలతో కలిసి నివసిస్తోంది. మిగతా ముగ్గురు పిల్లలు రిజ్వానాతో కలిసి జనతా నగర్ కాలనీలో ఉన్న ఒకే ఒక్క గదిలో నివసిస్తున్నారు.



23 ఏళ్ల క్రితం రిజ్వానాకు పెళ్లయింది. నలుగురు పిల్లలు పుట్టిన తరువాత ఆమె భర్త చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు రిక్షా నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక రోజు అతడి రిక్షాను ఎవరో దొంగిలించారు. దాంతో కుటుంబ పోషణ కష్టమైంది. భిక్షాటన చేసుకుని బతుకుతానని తన మానాన తాను వెళ్లి పోయాడు.. అప్పటి నుంచి తిరిగి ఇంటి ముఖం చూడలేదు.



స్విగ్గీ బ్యాగ్ గురించి అడిగినప్పుడు.. "డిస్పోజబుల్ గ్లాసులు, కప్పులను ఉంచడానికి నాకు బలమైన బ్యాగ్ అవసరం. అందుకే దాలిగంజ్ బ్రిడ్జి వద్ద విక్రయిస్తున్న వ్యక్తి నుంచి రూ.50కి బ్యాగ్ కొనుగోలు చేశాను. అప్పటి నుంచి నా సామాను ఈ బ్యాగ్‌లోనే తీసుకెళ్తున్నాను. నేను Swiggy లో పని చేస్తున్నానని ఈ బ్యాగ్ చూసిన వారు అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నేను స్విగ్గీలో పని చేయను. ఈ సంచిలో నా సరుకులన్నీ వేసుకుని పని కోసం మార్కెట్‌కి వెళతాను. నేను ప్రతిరోజూ దాదాపు 20 నుండి 25 కి.మీ నడుస్తాను అని చెప్పింది రిజ్వానా.



సోషల్ మీడియాలో తన ఫోటో వైరల్ అవ్వడాన్ని ప్రస్తావిస్తూ.."ఒక దుకాణదారుడు నాకు చిత్రాన్ని చూపించి అది ఎలా వైరల్ అయిందో నాకు చెప్పాడు. దీని తరువాత, ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చి నా బ్యాంకు వివరాలు అడిగి కొంత డబ్బు పంపించాడు. మరికొంత మంది వ్యక్తులు కూడా సహాయం చేశారు. దీంతో నా జీవితం కాస్త మెరుగ్గా ఉండబోతోందని నాకు అనిపిస్తోంది అని రిజ్వానా తెలిపింది.



ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ సేవల గురించి స్పష్టంగా తెలియని రిజ్వానా, "ప్రజలు నాకు స్విగ్గీ గురించి చెప్పారు. నేను కూడా అలాంటి ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను, అయితే సమస్య ఏమిటంటే నా దగ్గర ఎలాంటి రవాణా సౌకర్యం లేదు" అని చెప్పింది.

Tags

Next Story