అంగరంగ వైభవంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం

బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబికులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక సందడిగా జరిగింది. ఎలిజబెత్–2 మృతితో చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించారు. 74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా ముందుగా ప్రత్యేక బంగారు రథంలో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకున్నారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజు, రాణికి కిరీటధారణ చేశారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరించారు. ఇక భారత్ తరుపున ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ధన్‌ఖడ్ హాజరయ్యారు. సుమారు 100 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఛార్లెస్-3 పట్టాభిషేకం సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్‌లోని ఎంపిక చేసిన పంక్తులను పఠించారు. ఇతరులకు సేవ, సకల జనులపై క్రీస్తు ప్రేమను తెలియజేసేలా అది ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధానులు బైబిల్‌ను పఠించడం కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు సునాక్ కూడా దాన్ని పాటించారు. ఈసారి పట్టాభిషేక వేడుకలో భిన్న మత విశ్వాసాలకు పెద్దపీట వేసినట్లు కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ కార్యాలయం తెలిపింది. భారతీయ మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధాని, హిందూ మతస్థుడు అయిన సునాక్ క్రైస్తవ మత గ్రంథాన్ని పఠించడం అందుకు అద్దం పడుతుందని తెలిపింది.
రాజుగా తన పట్టాభిషేకం అనంతరం ఛార్లెస్ సుమారు 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు అందించారు. పట్టాభిషేక కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొన్న వివిధ శాఖల సిబ్బందికి, దేశానికి సేవలందిస్తున్న ఆర్మీ, పోలీసు, అత్యవసర సేవల సిబ్బందికి వీటిని అందించారు. ఇందుకోసం ముందుగానే ఛార్లెస్, కెమిల్లా ప్రతిమలతో కూడిన పతకాలను తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో హిందువులు, యూదులు, సిక్కులు, ముస్లింలు, బౌద్ధులతో పాటు పలు మత ప్రతినిధుల నుంచి ఛార్లెస్ అభినందనలు స్వీకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com