Imran Khan : పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌

Imran Khan : పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ను రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామాబాద్‌ హైకోర్టు దగ్గర ఇమ్రాన్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్‌ సమయంలో ఇమ్రాన్ లాయర్లు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఇదే సమయంలో ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఇమ్రాన్ ఖాన్ లాయర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పీటీఐ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇమ్రాన్‌ ఖాన్ అరెస్ట్‌తో పాక్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇమ్రాన్ మద్దతు దారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇమ్రాన్ మద్దతు దారుల ఆందోళనతో పాక్ రణరంగంగా మారుతోంది. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్ అరెస్ట్‌ను పీటీఐ పార్టీ తప్పుబట్టింది. ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఇమ్రాన్ అరెస్ట్‌ దృశ్యాలను విడుదల చేసిన పీటీఐ పార్టీ.. ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రభుత్వం వేధిస్తోందని మండిపడింది.

ఇమ్రాన్ ఖాన్‌ దాదాపు వంద కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. గత కొన్ని రోజులగా ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌కు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇస్లామాబాద్‌ హైకోర్టు వద్దకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్‌ను రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌పై ఇమ్రాన్‌ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను అంతం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ఇక తిరుగుబాటు కేసు, హత్యాయత్నం కేసులకు సంబంధించిన విచారణకు ఇస్లామాబాద్ హైకోర్టుకు ఇమ్రాన్ హాజరయ్యారు. తనపై పలు ఎఫ్ఐఆర్ లు నమోదైన నేపథ్యంలో.. బెయిల్ కోసం వెళ్లారు. ఈ సమయంలో ఇమ్రాన్ ను రేంజర్లు అరెస్టు చేశారు. అవినీతి కేసులో విచారణ జరుగుతుండగానే ఆయన్ను ఇలా అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుతో ఇస్లామాబాద్‌ అట్టుడికిపోతోంది.. ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి నిరసనలు తెలుపుతున్నారు.. రోడ్లపై ప్రభుత్వ దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలను దహనం చేస్తున్నారు.. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధించారు. ఇమ్రాన్‌ఖాన్ రహస్య ప్రదేశానికి తరలించింనట్లు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలోనే ఇమ్రాన్‌ విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్‌ తీరును కోర్టు తప్పుబట్టిందని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.


Tags

Next Story