పాత్రికేయుల పై ఎలాన్ మస్క్ ప్రతీకార చర్య; వారి ట్విట్టర్ ఎకౌంట్లకు ఎసరు

రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు. ట్విట్టర్ ను కైవసం చేసుకున్న దగ్గర నుంచి ఎలాన్ మస్క్ వ్యవహారం చూస్తుంటే ఇలానే అనిపిస్తోంది. ఈ సామాజిక మాధ్యమాన్ని చేజిక్కించుకున్నాక భారీ లే ఆఫ్ లతో తన ఉద్యోగులను గడగడలాడించిన మస్క్, తరువాత బ్లూ టిక్ గురించి మరో దుమారం లేపాడు. ఆ వేడి ఇంకా సద్దుమణగకముందే ఇప్పుడు మరోసారి వార్తలకెక్కాడు. తాజాగా పలువురు ప్రముఖ పాత్రికేయులు ఎలాన్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారి ట్విట్టర్ అకౌంట్ లు బహిష్కరణకు గురయ్యాయి.
ప్రపంచ సంపన్నుల జాబితాలో మొదటి స్థానాన్ని కోల్పోయిన ఎలాన్ మస్క్ ఉన్నట్లుండి గురువారం ప్రముఖ పాత్రికేయుల ట్విట్టర్ అకౌంట్ లను నిలిపివేశాడు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్ టన్ పోస్ట్ లో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టుల ఖాతాలను బహిష్కరించాడు. అయితే ట్విట్టర్ ఖాతాలు కోల్పోయిన వారందరూ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న నాటి నుంచి అతడి గురించి లోతుగా కథనాలు పబ్లిష్ చేస్తున్న వారే కావడం గమనార్హం.
అయితే జర్నలిస్టుల ఖాతాల బహిష్కరణ గురించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఈ అంశంపై స్పందిస్తూ మస్క్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. అందరిలాగానే పాత్రికేయులకు సైతం అవే నిబంధనలు వర్తిస్తాయని ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్, తనను రోజంతా విమర్శిస్తూనే ఉన్నా పట్టించుకోనని, కానీ, వ్యక్తిగత కార్యకలాపాల్లో అవసరానికి మించి జోక్యం చేసుకోవడం, తన కుటుంబానికి హాని చేకూరే విధంగా వ్యవహరించడం సహించబోనని మరో ట్వీట్ లో స్పష్టం చేశాడు. తన ప్రైవేట్ ప్లేన్ ఆచూకీని ట్రాక్ చేస్తున్న మరో అకౌంట్ ను సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన మస్క్, దీనివల్ల తన కుమారునికి భధ్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో సదరు అకౌంట్ ఓనర్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ట్వీట్ చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com