రష్యా వ్యాక్సిన్.. కొన్ని దుష్ప్ర భావాలు

రష్యా వ్యాక్సిన్.. కొన్ని దుష్ప్ర భావాలు
అంతా భ్రాంతియేనా.. ఆశా నిరాశేనా.. వైరస్ కి వ్యాక్సిన్ వచ్చిందన్నది కలేనా.. కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనుగొన్న రష్యా..

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొన్న రష్యా వైపు ప్రపంచం చూస్తున్న తరుణంలో వ్యాక్సిన్ (స్పుత్నిక్-వి) ఇంజెక్ట్ చేసిన తరువాత ఏడుగురు వాలంటీర్లలో ఒకరు దుష్ప్రభావాల బారిన పడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి చెప్పడం ప్రపంచాన్ని కొంత నిరాశకు గురిచేసింది. అయితే వైరస్ లతో వచ్చే వ్యాధులకు సంబంధించిన ఏ ఇతర వ్యాక్సిన్స్ లోనైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని వ్యాక్సిన్ తయారీ సంస్థ తెలిపింది.

రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో వివరణ ప్రకారం.. ప్రకటించిన 40,000 మంది వాలంటీర్లలో 300 మందికి పైగా స్పుత్నిక్ వి టీకాలు వేసినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. "సుమారు 14% మందికి బలహీనత, 24 గంటలు కండరాల నొప్పి, అప్పుడప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుదల గురించిన చిన్నచిన్న ఫిర్యాదులు ఉన్నాయి" అని బుధవారం మాస్కో టైమ్స్ పేర్కొంది. స్పుత్నిక్ వి ఇంకా పెద్ద ఎత్తున క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. రష్యా ప్రభుత్వం గత నెలలో ఈ వ్యాక్సిన్ ను ఆమోదించింది. ప్రపంచంలో కరోనాకు వ్యాక్సిన్ తీసుకువచ్చిన మొట్టమొదటి దేశంగా రష్యా తనని తాను ప్రకటించుకుంది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ యొక్క తుది క్లినికల్ ట్రయల్స్ ఈ నెల మొదట్లో మాస్కోలో ప్రారంభమయ్యాయి.

భారతదేశంలో స్పుత్నిక్ వి పంపిణీ కోసం ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్ కు సంబంధించి క్షుణ్ణంగా సమీక్ష జరిపిన తర్వాతే అనుమతి ఇస్తామని భారత అధికారులు తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ, కోవిడ్ -19 వ్యాక్సిన్‌పై రష్యా నుంచి వస్తున్న డేటాను ఉన్నత స్థాయి ప్రభుత్వ కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story