USA: అమెరికాలో ట్రక్కు బీభత్సం, 10 మందికి పైగా మృతి

నూతన సంవత్సరం వేడుకల వేళ అమెరికాలోని న్యూఓర్లీన్స్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. విలాస వేడుకలకు పేరుపొందిన బార్బన్ స్ట్రీట్, ఐబర్‌విల్లే మధ్య వీధిలో బుధవారం తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో జన మూహంపైకి వేగంగా ఓ ట్రక్కు దూసుకువచ్చింది. జనం భీతావహులై పరుగుత్తుతుండగా ట్రక్కు నుంచి దిగిన డ్రైవర్ జనంపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 35 మంది వరకు గాయపడ్డారు.
ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణిస్తూ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టింది. పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో ట్రక్కు డ్రైవర్ మరణించాడు. పేలుడు పదార్థాలు ఏవైనా దాచి ఉంచారా అన్న అనుమానంతో పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు జరుపుతున్నారు. ఘటనా స్థలంలో ఒక ఐఈడీగా అనుమానిస్తున్న వస్తువు లభించినట్టు ఎఫ్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా.. ట్రక్కు డ్రైవర్ సాగించిన హత్యాకాండను ఉగ్రవాద చర్యగా న్యూ ఓర్లీన్స్ మేయర్ లాటోవా కాంట్రెల్ అభివర్ణించారు.
ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యలని నగర పోలీసుకమిషనర్ అన్నే కిర్క్‌పాట్రిక్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే మారణకాండ సృష్టించడానికి ట్రక్కు డ్రైవర్ ప్రయత్నించాడని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు వేలాది మంది బార్బన్ వీధిలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించడంతో అక్కడకు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లవద్దని ప్రజలను పోలీసులు కోరారు. ఘటనలో గాయపడిన వారిని దవాఖానలకు తరలించి చికిత్స అందచేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com