United Kingdom : యూకేలో అలజడి రేపుతున్న 100 రోజుల దగ్గు

United Kingdom :  యూకేలో అలజడి రేపుతున్న 100 రోజుల దగ్గు
X
అధికారుల సీరియస్ వార్నింగ్

యూకేని 100 రోజుల దగ్గు వణికిస్తోంది. కోరింత దగ్గు రకానికి చెందిన ఈ దగ్గు మూడునెలల పాటు కొనసాగుతోంది. ఇది చాలా తొందరగా ఒకరి నుంచి మరొకరికి సోకుతోందని ఇప్పటికే యూకే హెల్త్‌ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. యూకే వ్యాప్తంగా పలు చోట్ల ఈ కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే 250% మేర కేసులు పెరిగినట్టు అక్కడి వైద్యులు వెల్లడించారు. సాధారణ జలుబుగా మొదలై క్రమంగా లక్షణాలు పెరుగుతున్నాయి. దాదాపు మూడు నెలల పాటు విపరీతమైన దగ్గుతో సతమతం అవుతున్నారు బాధితులు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ లెక్కల ప్రకారం...జులై, నవంబర్ మధ్య కాలంలో 716 కేసులు నమోదయ్యాయి. నేరుగా ఊపిరితిత్తులకు సోకుతుందీ వైరస్. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఈ కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా నమోదవుతున్నాయి.

యూకేని ఇప్పుడు కోరింత దగ్గు చాలా ఇబ్బంది పెడుతోంది. ముక్కు కారడం, గొంతు నొప్పితో మొదలైన దీనిని సాధారణ జలుబుగా పొరబడవచ్చు. ఆ తరువాత దగ్గు మొదలై దగ్గలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దగ్గు కారణంగా గొంతులో పుండ్లు, చెవిలో ఇన్ఫెక్షన్లు ఓ దశలో మూత్రవిసర్జన ఆపుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాక్టీరియా కారణంగా సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. 3 లేదా 4 నిముషాల పాటు తీవ్రమైన దగ్గు రావడం వల్ల వాంతులు, లేదా పక్కటెముకలు విరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం యూకేలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) నుండి ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ రిచర్డ్ టెడ్డర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం కోరింత దగ్గు గతేడాదితో పోలిస్తే 250 శాతం పెరిగిందని తెలుస్తోంది. కరోనా, లాక్ డౌన్ సమయంలో ఇంత తీవ్రమైన పరిస్థితి కనిపించలేదు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లల్లో ఈ దగ్గు నివారించడానికి మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి టీకాలు అవసరం అని NHS హెచ్చరించింది. గర్భిణీలు టీకాలు వేయించుకోవాలని .. తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించాలని పేర్కొంది. జూలై నుండి నవంబర్ మధ్య ఇంగ్లాండ్, వేల్స్ లో 716 మంది కోరింత దగ్గు బారిన పడ్డారు. 2022 తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story