Iran blasts: ఇరాన్‌లో జంట పేలుళ్లు…103మంది మృతి

ఇరాన్‌లో బాంబుల మోత మోగింది. ఇరాన్ దేశంలో జరిగిన జంట పేలుళ్లలో 103 మంది మరణించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ సైనికాధికారి జనరల్ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం బుధవారం జరుగుతున్న వేళ నిమిషాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తులు జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 103 మంది మరణించగా, 188 మందికి గాయాలయ్యాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. సులేమాని నాలుగో వర్ధంతి సందర్భంగా కెర్మాన్ పట్టణంలోని ఓ శ్మశానంలో ఉన్న ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకొన్నారు.
ఈ స్మారక కార్యక్రమం జరుగుతున్న సమయంలో దాదాపు 20 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగాయని అధికారులు తెలిపారు. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో జరిగిన తాజా వరుస పేలుళ్ల ఘటన సంచలనం రేపింది. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద లేదా ఇతర సంస్థ ఏదీ ప్రకటించలేదు.
బాంబు దాడులను ఉగ్రదాడిగా కెర్మాన్ డిప్యూటీ గవర్నర్ రెహ్మాన్ జలాలి పేర్కొన్నారు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారో అయన చెప్పలేదు. స్మారక కార్యక్రమానికి వందలాది సంఖ్యలో వచ్చిన వాళ్లు క్యూలలో నిలబడిన సమయంలో వరుస బాంబు దాడులకు పాల్పడ్డారు. మొదట బాంబు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పేలిందని, 20 నిమిషాల తర్వాత మరో బాంబును ఆపరేట్ చేశారని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అహ్మద్ వాహిది వెల్లడించారు.
రెండో పేలుడు ఘటనలోనే ఎక్కువ మంది మరణించారని, గాయపడ్డారని తెలిపారు. మొదటి బాంబు దాడి తర్వాత రెస్క్యూ చర్యలు చేపట్టిన ఎమర్జెన్సీ సిబ్బంది లక్ష్యంగా రెండో బాంబు దాడికి పాల్పడినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ లక్ష్యంగా జరిగిన ఈ తీవ్రవాద దాడిని 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత పెద్ద దాడిగా చెబుతున్నారు.
ఇరాన్ ఇంటా బయటా పలు బహిష్కరణ గ్రూపులు, తీవ్రవాద సంస్థల నుంచి శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్నది. అణు కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ఇరాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. అయితే సామూహిక బాంబు దాడులుగా కాకుండా లక్షిత హత్యలుగా జరిగాయి. ఇక ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సహా సున్నీ తీవ్రవాద గ్రూపులు గతంలో షియా మెజార్టీగా ఉండే ఇరాన్‌లో పెద్దయెత్తున దాడులకు పాల్పడ్డాయి. 2022లో 22 ఏండ్ల మహ్షా అమిని హత్యకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో పాటు గత కొన్నేండ్లుగా ఇరాన్‌లో వివిధ అంశాలపై పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా, గాజాలోని హమాస్, లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలకు దశాబ్దాలుగా ఆయుధాలు అందజేస్తున్న దేశంగా ఇరాన్ ఉన్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com