బామ్మ @ 105.. జిన్‌లో నానబెట్టిన ఎండుద్రాక్ష ఆమె హెల్త్ సీక్రెట్

Lucia DeClerck @105
Lucia DeClerck @105: ఈ వయసులో ఏం తింటాం.. నమలడానికి పళ్లూ ఉండవు.. జీర్ణక్రియా సక్రమంగా పని చేయదు. అని కదా నా వయసు వాళ్లు అనుకుంటారు.. కానీ నేను మాత్రం అలా కాదు.. హ్యాపీగా ఉన్నాను. అన్నీ తింటాను. కానీ ఎక్కువగా తినేది జిన్‌లో నానబెట్టిన ఎండుద్రాక్ష అని మెరిసే కళ్లతో ఆనందంగా చెబుతున్నారు బామ్మ లూసియా. మహమ్మారి కరోనా వచ్చినా నన్నేమీ చేయలేదు అని ధీమాగా చెబుతున్నారు.
ఇంకెన్నాళ్లు బతుకుతానో తెలియదు కానీ.. ఉన్నన్నాళ్లు ఆరోగ్యంగానే ఉంటానని అనుకుంటున్నాను. నా పిల్లలు, నా మనవళ్లు, మనవరాళ్లు అందరూ నన్ను బాగా చూసుకుంటారు.. అసలు అదే నిజానికి నా ఆరోగ్య రహస్యం. ఆ తరువాతే జిన్‌లో నాన బెట్టిన ఎండు ద్రాక్ష.. అని ఆనందంగా చెబుతోంది అవలీలగా సెంచరీ దాటేసిన బామ్మ. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకుంది.
వృద్దుల మీద ఎక్కువగా ప్రభావం చూపిన ఈ వైరస్ ఈ బామ్మ గారిని చూసి భయపడి తోక ముడిచింది. నిజానికి వందేళ్లు పైబడిన వారే కరోనా బారిన పడి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అందులో న్యూజెర్సీకి చెందిన 105 ఏళ్ల బామ్మ లూసియా డిక్లెర్క్ కూడా ఒకరు. జనవరి 25న 105వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సమయంలోనే ఆమెకు కోవిడ్ సోకింది. ఆస్పత్రిలో చేరిన కొన్ని వారాల్లోనే కోలుకుని ఇంటికి చేరుకుంది.
ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ నుంచి కూడా ఆమె కోలుకుని బయటపడింది. తన జీవితంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన ఆమెను కరోనా, స్పానిష్ ఫ్లూ లాంటివి ఏం చేయలేకపోయాయని ధీమాగా చెబుతోంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కూడా జిన్-ఎండుద్రాక్షలు మేలు చేస్తాయని, అందులోని ప్లేసిబో ప్రభావం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని బామ్మగారు చెబుతున్నారు. కాగా, లూసియాకు ఇద్దరు కొడుకులు, ఐదుగురు మనవళ్లు, 12 మంది మునిమనవళ్లు, మరో 11 మంది ముని ముని మనవళ్లు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com