Inmates Escaped in Nigeria: భారీ వర్షాలతో దెబ్బతిన్న జైలు..118 మంది ఖైదీలు పరార్
భారీ వర్షాలు నైజీరియా (Nigeria) పోలీసులకు కొత్త చిక్కులు తీసుకొచ్చాయి. ఆ దేశంలోని ఓ జైలు నుంచి 118 మంది ఖైదీలు పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి. జైలు ప్రహారీ గోడ కూలడంతో.. అదను చూసుకుని 118 మంది ఖైదులు జైలు నుంచి పరారయ్యారని అధికారులు వెల్లడించారు. పారిపోయిన వారికోసం గాలిస్తున్నామని, ఇప్పటివరకు 10 మందిని మాత్రమే పట్టుకోగలిగామని చెప్పారు.
మిగిలినవారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపారు. అయితే తప్పించుకున్నవారు ఎవరనే విషయాలను వెల్లడించారు. గతంలో ఇదే జైలులో బోకో హరమ్ గ్రూప్ సభ్యులను బంధించారు. పరారైనవారిలో వారుకూడా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నైజీరియా జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఉగ్రవాదుల దాడులు, వసతుల లేమి కారణంగా ఈ మధ్యకాలంలో దేశంలోని జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయిన ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. 2022 జూలైలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే అబూజా జైలు నుంచి సుమారు 600 మంది ఇస్లామిక్ స్టేట్ ఖైదీలు పరారయ్యారు. అయితే వారిలో 300 మందిని పోలీసులు తిరిగి పట్టుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com