Philippines ferry accident: ఫిలిప్పీన్స్‌లో 300 మందితో వెళ్తూ మునిగిన ఫెర్రీ, 13 మంది జలసమాధి

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఒక ఫెర్రీ (ప్యాసింజర్ పడవ) సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, సహాయక బృందాలు 244 మందిని సురక్షితంగా కాపాడగలిగాయి.
జాంబోంగా నగరం నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి ఈ ఫెర్రీ బయలుదేరింది. మార్గమధ్యలో బాసిలన్ ప్రావిన్స్‌లోని బలుక్‌బలుక్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్ యూనిట్లు, నౌకలు, సమీపంలోని మత్స్యకారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి సంఖ్య ఇంకా కచ్చితంగా తెలియరాలేదు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని, దీనిపై దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు. జాంబోంగా పోర్టు నుంచి బయలుదేరే ముందు కోస్ట్ గార్డ్ అధికారులు ఫెర్రీని తనిఖీ చేశారని, అప్పుడు ఓవర్‌లోడింగ్ సంకేతాలు ఏవీ లేవని స్పష్టం చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గాలి, సముద్ర మార్గాల ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఫిలిప్పీన్స్‌లో తరచూ తుఫానులు, పడవల నిర్వహణ లోపాలు, నిబంధనలను సరిగా అమలు చేయకపోవడం వంటి కారణాలతో సముద్ర ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. 1987లో జరిగిన డోనా పాజ్ ఫెర్రీ ప్రమాదంలో 4,300 మందికి పైగా మరణించడం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర ప్రమాదంగా నమోదైంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
