Pak-Afghan Border : పాకిస్తాన్ – ఆఫ్ఘన్ బోర్డర్‌లో తూటాల వర్షం..

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య తూటాల వర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాక్ ఆర్మీ ఔట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పాక్ – ఆఫ్ఘన్ సరిహద్దు వెంట శనివారం అర్ధరాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఖైబర్ – పఖ్తుంక్వా, బలూచిస్థాన్ – డాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో పాక్ సైనికులు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆఫ్ఘన్ ప్రకటించింది. మరోవైపు ఆఫ్ఘన్ సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఇక ఆఫ్ఘన్ స్వాధీనం చేసుకున్న పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టుల్లో అస్థిర కునార్, హెల్మండ్ ప్రావిన్సులు కూడా ఉన్నాయని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బహ్రంచా జిల్లాలోని షకీజ్, బీబీ జాని, సలేహాన్ ప్రాంతాల్లో, ఫఖ్తుంక్వాలోని అర్యుబ్ జాజీ జిల్లా అంతటా కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆప్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా ఖోవరాజ్మి మాట్లాడుతూ.. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రతీకార చర్యగా ఈ దాడులను అభివర్ణించారు. శనివారం అర్ధరాత్రి నాటికి ఘర్షణలు ముగిశాయని పేర్కొన్నారు. మరోసారి పాక్ గగనతల ఉల్లంఘనకు పాల్పడితే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. పాక్ గగనతలాన్ని తప్పకుండా తాము ఆక్రమిస్తామని హెచ్చరించారు.
సౌదీ అరేబియా, ఖతార్ కలత..
పాకిస్థాన్ -ఆఫ్ఘనిస్థన్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతలపై సౌదీ అరేబియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాని విదేశాంగ మంత్రిత్వ శాఖ, “రెండు దేశాలు సంయమనం పాటించి, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలి. ఈ ప్రాంతం భద్రత, స్థిరత్వానికి శాంతి చాలా అవసరం” అని పేర్కొంది. ఖతార్ కూడా ఇదే విధంగా స్పందించింది. “ఉద్రిక్తతను తగ్గించడం, సంయమనం పాటించి శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించాలి. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దౌత్యం, సంభాషణల ద్వారా పరిస్థితిని మెరుగు పర్చుకోవాలి.” అని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com