Israel Air Strikes: రఫాపై ఇజ్రాయెల్‌ దాడి – 19మంది మృతి

కెరెమ్ షాలోమ్ సరిహద్దుపై రఫా​ నుంచి దాదాపు పది రాకెట్లు

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు విఫమయ్యాయి. దీంతో హమాస్‌కు ప్రధాన స్థావరంగా ఉన్న గాజాలోని రఫాపై ఇజ్రాయెల్‌ దాడులు ముమ్మరం చేసింది. హమాస్‌ దాడులకుప్రతిగా ఇజ్రాయెల్‌ బలగాలు విరుచుకుపడటంతో 16 మంది మరణించారు. రఫాపై వేర్వేరు చోట్ల నుంచి నగరంపై రెండు పర్యాయాలు దాడి జరిగిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొన్నాయి. ఇక గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 34,683 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు.

కాగా, ఇజ్రాయెల్‌తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిగిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ప్రకటించింది. చర్చల అనంతరం హమాస్ ప్రతినిధులు ఖతార్ వెళ్లిపోయారని పేర్కొంది. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, యుద్ధం ముగింపు లాంటి హమాస్ కీలక డిమాండ్లను నెతన్యాహు సర్కారు తిరస్కరించినట్టు సమాచారం. దీంతో చర్చలు విజయవంతం కాలేదని అనధికార వార్తల్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఫాతో పాటు గాజాలోని ఇతర ప్రాంతాల్లో అతి త్వరలో భారీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్ ప్రకటించింది.

మరోవైపు హమాస్‌ రాకెట్ దాడికి ప్రతికారంగా ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం చేసిన దాడిలో 19 మంది మృతి చెందినట్లు పాలస్తీనా అధికారులు పేర్కొన్నారు. హమాస్‌ రాకెట్‌ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దును మూసివేసినట్లు ప్రకటించింది. గాజాకు మానవతా సాయం, ఆహారం, వైద్య సామాగ్రి అందించడానికి వినియోగించే పలు సరిహద్దుల్లో కెరెమ్‌ షాలోమ్‌ ఒకటి. ఇక..కాల్పుల విరమణ, మానవతా సాయానికి సంబంధించి ఆదివారం హమాస్‌ మిలిటెంట్ల డిమాండ్‌ను ఇజ్రాయెల్‌ తిరస్కరించింది. ఖతర్, ఈజిప్ట్‌, అమెరికా దేశాలు కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్నా ఇజ్రాయెల్‌ మాత్రం గాజాలోని కీలకమైన రఫా నగరంపై తమ దాడి కొనసాగిస్తామని తేల్చిచెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story