Pakistan: జైలు నుంచి 17 మంది పరార్

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సులోని చమన్ జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారయ్యారు. ఈద్ ఉల్ అదా(బక్రీద్) సమయంలో వీరంతా పక్కా ప్లానింగ్ తో ఎస్కేప్ అయ్యారు.
బక్రీద్ సందర్భంగా చేసే ప్రత్యేక ప్రార్థనలే తమకు అనువైన సమయంగా నిర్ణయించుకున్నారు కొంతమంది పాకిస్తాన్ ఖైదీలు. అనుకున్నదే తడువుగా ఓ ఎస్కేప్ ప్లాన్ చేసుకున్నారు. బలూచిస్తాన్ లోని చమన్ జైలులో పండగ సందర్భంగా జైలు బ్యారక్ ఉన్న ఖైదీలను ప్రార్థనల కోసం బయటకు తీసుకు వచ్చారు. అయితే ఎప్పుడూ లేని విధంగా అకారణంగా ఈద్ ప్రార్థనల సమయంలో జైలులో ఒక్కసారిగా ఘర్షణలు తలెత్తాయి. ఇది పక్కాగా పథకం ప్రకారం జైలులో ఖైదీలు గొడవలను సృష్టించటమే అని పోలీసులు తెలుసుకొనేలోగా కొంతమంది ఖైదీలు పోలీస్ గార్డులపై హింసాత్మకంగా దాడి చేశారు. అదను చూసుకొని పారిపోవాలని ప్లాన్ చేశారు. ఈ సమయం లో అప్రమత్తం అయి జైలు గార్డులు జరిపిన కాల్పుల్లో ఒక ఖైదీ మరణించాడు. హింసలో కొంతమంది పోలీస్ గార్డులు, ఖైదీలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గొడవ జరుగుతున్న సమయంలో మొత్తం 17 మంది తప్పించుకున్నారు.
ఖైదీలు తప్పించుకునేందుకు బయటి వ్యక్తుల కూడా సాయపడినట్లు తెలుస్తోందని చెబుతున్న అధికారులు, పారిపోయిన ఖైదీల జాబితా సిద్ధం చేశారు. అయితే వారిలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు చమన్ జైలు ఇరాన్‌తో సరిహద్దు పట్టణానికి సమీపంలో ఉంది. పారిపోయిన ఖైదీలు తమకు సహాయం చేసిన బయటివారి సహాయంతోనే సరిహద్దు దాటి ఉంటారని భద్రతా బలగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com