బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన ప్లేయర్.. 17 ఏళ్లకే గుండెపోటుతో..
కరోనా వచ్చిన తరువాత కాలం మారినట్లు అనిపిస్తోంది. చిన్న వయసులోనే గుండెపోటుతో యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతకుమునుపు అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అంతలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా మరణం వారికి సంభవిస్తోంది.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని యోగ్యకర్తా ప్రావిన్స్‌లో టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు 17 ఏళ్ల చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కోర్టులో కుప్పకూలి మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో జపాన్‌కు చెందిన కజుమా కవానోతో జాంగ్ జిజీ ఆడుతున్నప్పుడు మూర్చ వచ్చి ఉన్నపళంగా కింద పడిపోయాడు.
ఇండోనేషియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (PBSI) వైద్య బృందాలు జాంగ్‌కు కోర్టులో చికిత్స అందించి ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారని చెప్పారు. కానీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ జాంగ్ ప్రాణాలు కోల్పోయాడు.
క్వార్టర్ ఫైనల్‌కు ముందు సోమవారం ఉదయం యోగ్యకార్తాలోని బ్యాడ్మింటన్ క్రీడాకారులు, అధికారులు కోర్టులో ఒక నిమిషం మౌనం పాటించారు. బ్యాడ్మింటన్ ప్రపంచం ప్రతిభావంతుడైన ఆటగాడిని కోల్పోయింది' అని బ్యాడ్మింటన్ ఆసియా, పీబీఎస్‌ఐ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
జాంగ్‌కు గుండెపోటు వచ్చినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పీబీఎస్‌ఐ అధికార ప్రతినిధి తెలిపారు. "రెండు ఆసుపత్రులలో బాధితుడికి సంబంధించిన పరీక్ష ఒకే ఫలితాలను చూపించింది. బాధితుడు ఆకస్మిక గుండె ఆగిపోవడాన్ని అనుభవించాడు" అని PBSI ప్రతినిధి బ్రోటో హ్యాపీ చెప్పారు.
చైనా బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్రీడాకారుడి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. "జాంగ్ జిజీ జాతీయ యువ బ్యాడ్మింటన్ జట్టులో అత్యుత్తమ అథ్లెట్" అని అసోసియేషన్ తెలిపింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ జాంగ్ కుటుంబానికి, చైనా జట్టుకు సానుభూతి తెలిపింది.
"మేము అతని కుటుంబానికి, అతని సహచరులకు, చైనీస్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మరియు మొత్తం చైనీస్ బ్యాడ్మింటన్ కమ్యూనిటీకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని ఫెడరేషన్ తెలిపింది.
జాంగ్ కిండర్ గార్టెన్ నుంచి బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించాడు. గత సంవత్సరం చైనా జాతీయ యువ జట్టులో చేరాడు. ఈ ఏడాది ప్రారంభంలో, అతను డచ్ జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com