Israel-Hamas: రక్తమోడుతున్న గాజా

Israel-Hamas:   రక్తమోడుతున్న గాజా
X
జవైదా పట్టణంపై వైమానిక దాడి, ఒకే కుటుంబంలో 18 మంది మృతి

ఇజ్రాయెల్‌ సైన్యం యథేచ్ఛగా జరుపుతున్న దాడులతో గాజా ప్రాంతం రక్తమోడుతోంది. శనివారం ఉదయం జవైదా పట్టణంలోని ఓ నివాసంతోపాటు పక్కనే ఉన్న శరణార్థులు తలదాచుకున్న భవనంపై ఇజ్రాయెల్‌ ఆర్మీ జరిపిన దాడిలో సమీ జవాద్‌ అల్‌ ఎజ్లా, అతడి కుటుంబంలోని 18 మంది మృత్యువాతపగా, మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులను సమీ ఇద్దరు భార్యలు, 2 నుంచి 22 ఏళ్ల వయస్సున్న 11 మంది సంతానం, వారి అమ్మమ్మ, మరో ముగ్గురు బంధువులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

ఇజ్రాయెల్‌ నుంచి గాజాలోకి చేపలు, మాంసం తరలించే ప్రక్రియకు సమీ సమన్వకర్తగా వ్యవహరించేవాడని, చాలా మంచి వ్యక్తని చెప్పారు. ఘటన సమయంలో రెండు భవనాల్లో కలిపి 40 మంది వరకు ఉన్నట్లు వివరించారు. ఇలా ఉండగా, సెంట్రల్‌ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్‌ ఆర్మీ శనివారం పాలస్తీనియన్లను హెచ్చరించింది. ఆ ప్రాంతం వైపు నుంచే తమ భూభాగం మీదికి మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తున్నారని పేర్కొంది.

లెబనాన్‌లోని నాబాతీహ్‌ ప్రావిన్స్‌లో జరిపిన మరో దాడిలో ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హెజ్‌బొల్లాకు చెందిన ఆయుధ నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్లు ఇజ్రాయెల్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. తీరప్రాంత టైర్ నగరంలో జరిపిన దాడిలో ఓ హెజ్‌బొల్లా కమాండర్‌ను హతమార్చినట్లు వెల్లడించారు. సెంట్రల్ గాజాలోని మాఘాజీ శరణార్థి శిబిరం, పరిసర ప్రాంతాల్లోని పాలస్తీనీయన్లు వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.

యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్ మరియు ఖతార్ మధ్యవర్తులు ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన చర్చలలో పలు విషయాలను చర్చించారు. కైరోలో వచ్చే వారం మరోసారి సమావేశం కానున్నారు. విరమణ అమలు వివరాలను రూపొందించాలని భావిస్తున్నారు. గాజాలో దాడులను ఆపడమే లక్ష్యంగా మధ్యవర్తుల చర్చలు జరిపారు. ఇక్కడ మరణాల సంఖ్య 40,000 దాటింది.

Tags

Next Story