Pakistan: కొండచరియలు విరిగిపడి.12 మంది మృతి

పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నట్లు పాకిస్థాన్ మీడియా నివేదించింది.
శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్ దిర్ జిల్లాలో గల మైదాన్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అవి నేరుగా ఓ ఇంటిపై పడటంతో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు కాగా, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సదరు అధికారిని ఊటంకిస్తూ డాన్ వార్తాపత్రిక పేర్కొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. శిథిలాల కింద నుంచి మొత్తం 12 మంది మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది.
కాగా, గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పాకిస్థాన్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ భారీ వర్షాలకు ముర్రే, గల్లియత్, మన్సెహ్రా, కోహిస్తాన్, చిత్రాల్, దిర్, స్వాత్, షాంగ్లా, బునేర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com