Russias -Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

దేశంలోనే అతిపెద్ద చిన్నారుల ఆస్పత్రిపై దాడి

రాజధాని కీవ్‌ సహా ఉక్రెయిన్‌ నగరాలపై సోమవారం రష్యా భీకర క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం 20 మంది చనిపోయారని, 50 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధికారులు మీడియాకు వెల్లడించారు. రాజధాని కీవ్‌లోని అతిపెద్ద పిల్లల దవాఖాన పైనా రష్యా క్షిపణి దాడులు జరిపింది. ఈ ఘటనలో పిల్లలు, వైద్య సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయారని, అక్కడ సహాయ ఆపరేషన్‌ చేపట్టామని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ‘ఎక్స్‌’లో తెలిపారు. ఈ దాడులపై ప్రపంచ దేశాలు మౌనం వహించరాదని ఆయన కోరారు.

ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) భీకర దాడులతో విరుచుకుపడింది. రాజధాని కీవ్‌ (Kyiv) సహా దేశవ్యాప్తంగా ఆయా నగరాలపై పెద్దఎత్తున క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో 20 మంది మృతి చెందారు. దాదాపు 50 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. కీవ్‌లోని దేశంలోనే అతిపెద్ద చిన్నారుల ఆస్పత్రి ‘ఓఖ్‌మాత్‌డిత్‌’పైనా దాడి జరిగింది. నాలుగు నెలల వ్యవధిలో రాజధానిపై జరిగిన ఇదే అతిపెద్ద దాడులివే. పేలుళ్ల ధాటికి స్థానికంగా భవనాలు దద్దరిల్లాయి. కీవ్‌లో ఏడుగురు మృతి చెందారు. క్రీవిరీహ్‌లో 10 మంది, దొనెట్స్క్‌లోని పోక్రోవ్స్క్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

అత్యాధునిక కింజాల్‌ రాకెట్లను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ వాయుసేన ఆరోపించింది. 40కిపైగా క్షిపణులతో తమ దేశంలోని అయిదు నగరాలను మాస్కో లక్ష్యంగా చేసుకుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. పిల్లల ఆస్పత్రి భవనం పాక్షికంగా ధ్వంసమైందని, శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకూడదని, రష్యా ఏం చేస్తుందో అందరూ చూడాలని సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో ‘నాటో’ శిఖరాగ్ర సమావేశాల వేళ ఈ దాడులు చేసుకోవడం గమనార్హం.

Tags

Next Story