Libya Dam Collapse : లిబియా వరద విలయం..

డేనియల్ తుపాను బీభత్సంతో ఆఫ్రికా దేశం లిబియాలో ఎటుచూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. ఈ ఘోర విపత్తుకు కారణంగా ఓడరేవు నగరం డెర్నా శ్మశానంగా మారింది. ఇళ్లు వీధులు, సముద్రం తీరం నదీ ఒడ్డు ఇలా ఎక్కడ చూసినా మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. రెండు డ్యాంలు బద్దలై డెర్నాను ముంచెత్తిన వరద ఉద్ధృతికి 20 వేల మంది మరణించి ఉండొచ్చని మేయర్ తెలిపారు. డెర్నాలోని ప్రతీ ఇంటిలో కనీసం ఒకరు మరణించి ఉండొచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. అయినవాళ్ల ఆచూకీ లేక నిత్యావసరాలు లేక డెర్నా నగర ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఇరువైపులా ఎత్తైన పర్వతాలు , ఆ పర్వతాల మధ్యన లక్షన్నర టన్నుల బరువున్న నీటిని నిలుపుదల చేసే రెండు భారీ డ్యాంలు, ఆ రెండు పర్వాతాల కింద 90 వేల మంది జనాభా కలిగిన ఓ నగరం, ఈ నగరంపై ప్రకృతి పగబట్టింది. మహోగ్రరూపమై విరుచుకుపడ్డ తుపాను ధాటికి ఆ రెండు డ్యాంలు బద్దలయ్యాయి. లక్షన్నర టన్నుల బరువున్న నీరు 7 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతూ ఆ నగరాన్ని తుడిచిపెట్టేసింది. భారీ రాళ్లను, చెట్లను తనలో కలుపుకుని జలం విలయం సృష్టించింది. ఆ మహా విలయానికి ఆ నగరంలో ప్రతీ ఇంటిలో కనీసం ఒకరు కన్నుమూశారు.
డేనియల్ తుపాను ధాటికి అతలాకుతలమైన లిబియాలో ఎటుచూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరదల ధాటికి 18 వేల నుంచి 20 వేల మంది మరణించి ఉండొచ్చని డెర్నా మేయర్ అబ్దుల్మేనమ్ అల్-గైతీ తెలిపారు. 90 వేల జనాభా కలిగిన డెర్నాలో వేలమంది గల్లంతయ్యారని, సహాయక బృందాలు వెల్లడించాయి. వీధులు, శిధిలమైన భవనాలు, సముద్ర తీరాలు, నదులు, ఇళ్లు ఇలా ఎక్కడ చూసినా మృతదేహాలే దర్శనమిస్తున్నాయి.
డేనియల్ తుపాను ధాటికి గల్లంతైన వేలాది మంది ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు లిబియా అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబు లమౌషా వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. వరదల కారణంగా చాలా ప్రాంతాలకు రహదారులు కొట్టుకుపోయాయని సహాయ చర్యలు చేపట్టేందుకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని వివరించారు. వరద నగరం మధ్య నుంచి ప్రవహించిందని ప్రవాహ ఉద్ధృతి మొత్తం నగరాన్నే తుడిచిపెట్టేసిందని వెల్లడించారు. డెర్నాలో కనీసం 30 వేల మంది ప్రజలు వరదల కారణంగా నిరాశ్రయులయ్యారని ఐక్రయరాజ్య సమితి అంచనా వేసింది. బైడా, సుసా, మార్జ్ పట్టణాల్లోనూడేనియల్ తుపాను విధ్వంసం సృష్టించిందని లిబియా అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com