Israel : మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై దాడి, 260 మృతదేహాలు లభ్యం

Israel :  మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై  దాడి, 260 మృతదేహాలు లభ్యం
డ్యాన్స్ చేస్తున్న ఇజ్రాయెల్ పౌరులపై పారాచూట్లతో దిగి మిలిటెంట్ల కాల్పులు

ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మికంగా దాడి చేసి తూటాల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. గాజాకు సమీపంలోని కిబ్బట్జ్ రీమ్ సమీపంలో జరిగిన నేచర్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడి అనంతరం ఆ స్థలంలో ఏకంగా 260 మృతదేహాలు కనుగొన్నారు. నృత్యవేడుక చుట్టుపక్కల రాకెట్ దాడితో మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు తప్పించుకోవడానికి ప్రయత్నించారు.

ఇజ్రాయెల్ పై శనివారం రాకెట్లతో విరుచుకు పడ్డ హమాస్ మిలిటెంట్లు.. బార్డర్ లో జరుగుతున్న ఓ మ్యూజికల్ పార్టీపైనా తూటాల వర్షం కురిపించారు. పారాచూట్లతో బార్డర్ దాటి పార్టీ జరుగుతున్న చోట ల్యాండయ్యారు. గాలిలో ఉండగానే కాల్పులు ప్రారంభించి, నేలపై దిగాక విచక్షణారహితంగా బుల్లెట్లతో విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లు తమ తుపాకులకు బలిచ్చారు. చుట్టూ ఖాళీ జాగానే ఉండడంతో తలదాచుకునేందుకు చోటులేక ఇజ్రాయెల్ పౌరులు నిస్సహాయంగా మృత్యువాత పడ్డారు. కొంతమంది పరుగెత్తుకెళ్లి కార్లలో దాక్కున్నా మిలిటెంట్లు విడిచిపెట్టలేదు. కార్లన్నీ వెతుకుతూ మరీ కాల్పులు జరిపారు.


సుక్కోట్ సెలవుల సందర్భంగా గాజా బార్డర్ లోని పొలాల్లో ఆల్ నైట్ మ్యూజికల్ పార్టీ ఏర్పాటు చేశారు. సెలవుల నేపథ్యంలో ఈ పార్టీకి పెద్ద సంఖ్యలో పౌరులు హాజరయ్యారు. పార్టీలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ, తింటూ తాగుతూ చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో సడెన్ గా ఆకాశం నుంచి హమాస్ మిలిటెంట్లు పారాచూట్లతో అక్కడ ల్యాండయ్యారు. మిలిటెంట్లు కాల్పులు జరపడంతో అక్కడ గందరగోళం నెలకొంది. వారి నుంచి తప్పించుకోవడానికి జనం పరుగులు పెట్టారు. అయితే ఇసుక ప్రాంతం కావడంతో వారు ఎక్కువ దూరం వెళ్ళలేక పోయారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. మిలిటెంట్లు వారిని చుట్టుముట్టి తూటాల వర్షం కురిపించారు. 260 మందిని హతమార్చారు.

Tags

Read MoreRead Less
Next Story