Iskcon: బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్‌ సభ్యుడి అరెస్టు

Iskcon: బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్‌ సభ్యుడి అరెస్టు
X
ఎక్స్‌’ (ట్విటర్‌)లో వెల్లడి..

బంగ్లాదేశ్‌లో నిరసనల నేపథ్యంలో మరో హిందూ పూజారిని అరెస్టు చేశారు. పూజారి శ్యామ్ దాస్ ప్రభును ఆ దేశ పోలీసులు ఛటోగ్రామ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇస్కాన్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆధ్యాత్మిక నేత చిన్మయ్‌ కృష్ణ దాస్‌ను అరెస్ట్‌ చేసిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నాయి. జైలులో ఉన్న చిన్మయ్‌ కృష్ణ దాస్‌ను కలిసేందుకు శ్యామ్ దాస్ ప్రభు వెళ్లినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎలాంటి వారెంట్ లేకుండానే ఆయనను అరెస్టు చేసినట్లు ఇస్కాన్ ప్రతినిధి, కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ తెలిపారు. ‘మరో బ్రహ్మచారి శ్రీ శ్యామ్ దాస్ ప్రభును ఈ రోజు ఛటోగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు’ అని ఎక్స్‌లో శుక్రవారం పేర్కొన్నారు.

కాగా, బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) మాజీ సభ్యుడు, హిందూ పూజారి చిన్మయ్‌ కృష్ణ దాస్‌ను దేశద్రోహం కేసులో ఆ దేశ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీంతో ఆయన అరెస్ట్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా, ఛటోగ్రామ్‌తో సహా పలు ప్రాంతాల్లోని హిందువులు నిరసనలు చేపట్టారు. చిన్మయ్ కృష్ణ దాస్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు చిన్మయ్‌ కృష్ణ దాస్‌ బెయిల్‌ను ఛటోగ్రామ్ కోర్టు మంగళవారం నిరాకరించింది. ఈ నేపథ్యంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లాం మరణించాడు. ఈ లాయర్ హత్యకు సంబంధించి బంగ్లాదేశ్ పోలీసులు ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మైనారిటీ హిందూ కమ్యూనిటీకి చెందిన 46 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కాగా, శుక్రవారం ఛటోగ్రామ్‌లో మూడు హిందూ ఆలయాలను ఒక గుంపు ధ్వంసం చేసింది.

Tags

Next Story