Drone Attack: జోర్డాన్‌లో డ్రోన్ దాడి..

జోర్డాన్‌లో జరిగిన డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన ముగ్గురు భద్రతా దళ సభ్యులు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడి వెనుక ఇరాన్ ప్రోత్సాహక మిలిటెంట్ గ్రూప్ ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. 25 మంది గాయపడ్డారు. ఇరాక్ కేంద్రంగా పనిచేసే ముజాహిదీన్ ఆఫ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూపు ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యాక పశ్చిమాసియాలో అమెరికా సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తాము నాలుగు శత్రు స్థావరాలపై దాడులు చేశామని ఇస్లామిక్ రెసిస్టెన్స్ ప్రకటించింది.
సిరియాలో మూడు, ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో ఒక ప్రాంతంపై దాడులు చేశామని వెల్లడించింది. తమ స్థావరంపై దాడి ఇరాన్ మద్దతిచ్చే మిలిటరీ గ్రూపు పనేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దాడులకు పాల్పడిన వారిని తగిన సమయంలో శిక్షిస్తామని స్పష్టంచేశారు. మరోవైపు ఈ ఘటనపై జోర్డాన్ స్పందించింది. తమ దేశం బయట సిరియా సరిహద్దులో దాడి జరిగినట్లు వెల్లడించింది. జోర్డాన్‌లో అమెరికా స్థావరం ఉంది. దాదాపు 3,000 మంది అమెరికా సైనికులు అక్కడ ఉంటున్నారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం మొదలయ్యాక ఇరాక్, సిరియాల్లోని అమెరికా స్థావరాలపై తరచూ దాడులు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత మధ్య ప్రాచ్యంలో ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ల దాడిలో అమెరికా దళాలకు చెందిన సభ్యులు ఇలా ఒక దాడిలో మరణించడం నెలల వ్యవధిలో ఇదే తొలిసారని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత ఇరాక్, సిరియాలలో ఉన్న అమెరికా దళాల బేస్‌లపై తరచూ డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com