Argentina Shock: అర్జెంటీనాలో డ్రగ్స్ గ్యాంగ్ దారుణం, సోషల్ మీడియాలో లైవ్‌

Argentina Shock: అర్జెంటీనాలో డ్రగ్స్ గ్యాంగ్ దారుణం,  సోషల్ మీడియాలో లైవ్‌
X
ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు యువతులను చిత్రహింసలు పెట్టి హత్య చేయడమే కాకుండా, ఈ ఘోరకృత్యాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పాశవిక చర్యకు వ్యతిరేకంగా శనివారం వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. బాధిత కుటుంబసభ్యులతో కలిసి పార్లమెంట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

బ్యూనస్ ఎయిర్స్ శివారు ప్రాంతానికి చెందిన మోరెనా వెర్డి (20), బ్రెండా డెల్ కాస్టిల్లో (20), లారా గుటియెర్రెజ్ (15) అనే ముగ్గురు అమ్మాయిలు ఈ నెల 19న అదృశ్యమయ్యారు. ఐదు రోజుల తర్వాత, బుధవారం ఒక ఇంటి పెరట్లో వారి మృతదేహాలను పోలీసులు పాతిపెట్టిన స్థితిలో కనుగొన్నారు. డ్రగ్స్ ముఠాతో ఉన్న విభేదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పార్టీ పేరుతో యువతులను ఒక వ్యాన్‌లోకి ఎక్కించుకుని, ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు.

ఈ కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరు హత్యను ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ అకౌంట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు వెల్లడించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సుమారు 45 మంది ఈ లైవ్‌ను చూసినట్లు అధికారులు తెలిపారు. "నా దగ్గర డ్రగ్స్ దొంగిలిస్తే ఇలాగే జరుగుతుంది" అని ఒక ముఠా నాయకుడు వీడియోలో హెచ్చరించినట్లు సమాచారం. నిందితులు బాధితుల వేళ్లను నరికి, గోళ్లను పీకి, తీవ్రంగా కొట్టి ఊపిరాడకుండా చేసి చంపారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఘటనపై స్పందించిన జాతీయ భద్రతా మంత్రి పాట్రిసియా బుల్రిచ్ మాట్లాడుతూ ఇప్పటివరకు ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలతో సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు శుక్రవారం ప్రకటించారు. ఐదో నిందితుడిని బొలీవియా సరిహద్దు నగరమైన విల్లాజోన్‌లో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ హత్యలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న 20 ఏళ్ల పెరూ దేశస్థుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు, ఈ లైవ్ స్ట్రీమింగ్ తమ ప్లాట్‌ఫామ్‌పై జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ 'మెటా' ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దారుణమైన నేరంపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని మెటా ప్రతినిధి చెప్పారు. నిరసనలో పాల్గొన్న బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. "జంతువులతో కూడా ఇంత క్రూరంగా ప్రవర్తించరు. మాకు న్యాయం జరగాలి" అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Next Story