Sudan: సూడాన్‌లో ఘోరం, ఆస్పత్రిపై డ్రోన్ దాడి

Sudan: సూడాన్‌లో ఘోరం,  ఆస్పత్రిపై డ్రోన్ దాడి
X
30 మంది మృతి.. పలువురికి గాయాలు

సూడాన్‌లో ఘోరం జరిగింది. డార్ఫర్ ప్రాంతంలోని ఎల్-ఫాషర్‌లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతిచెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు వైద్య వర్గాలు శనివారం తెలిపాయి. 2023 ఏప్రిల్ నుంచి సూడాన్‌‌పై పట్టు కోసం సైన్యం, పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు పోరు కొనసాగిస్తున్నాయి. అయితే ఏ గ్రూప్ ఈ చర్యకు పాల్పడిందో తెలియాల్సి ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అత్యవసర సేవలు అందిస్తున్న కేంద్రం ధ్వంసమైందని వైద్యవర్గాలు వెల్లడించాయి.

అయితే కొన్ని వారాల క్రితమే ఆ ఆస్ప్రత్రిపైనే పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (RSF) బలగాలు డ్రోన్లతో దాడి చేసినట్లు అక్కడి వారు చెబుతున్నారు. అయితే ఈ ఆస్పత్రిపై ఇప్పుడు ఎవరు ఈ డ్రోన్ దాడి చేశారనేదానిపై క్లారిటీ లేదు. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోంది. ఇదిలాఉండగా 2023 ఏప్రిల్‌ నుంచి సుడాన్‌లో సంక్షోభం నెలకొంది. అధికారం కోసం ఓవైపు సుడాన్ సైన్యం, మరోవైపు పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (RSF) బలగాలు మధ్య పోరు సాగుతోంది. ఇప్పుడు జరిగిన ఆస్పత్రిపై ఏ గ్రూప్ దాడి చేసిందనేది తెలియాల్సి ఉంది.

ఎల్-ఫశేర్‌లో ఆస్పత్రులపై దాడులు చేయడం సాధారణంగా మారిపోయింది. ఇక్కడ అత్యవసర వైద్య సేవలు ఇప్పటికీ అందిస్తున్న చివరి ఆస్పత్రిగా సౌదీ ఆస్పత్రి పనిచేస్తోందని ఇటీవలే వైద్యులు తెలిపారు. ఇప్పుడు అది కూడా ధ్వంసం కావడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సూడాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 80 శాతం వైద్య సేవలు అందించలేని పరిస్థితులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే సూడాన్‌లో కేవలం వైద్య సౌకర్యాలు మాత్రమే ప్రభావితం కాలేదు. 2024లో సుడాన్‌లో జరిగిన సివిల్ వార్ వల్ల 1.7 కోట్ల మంది చిన్నారులు స్కూళ్లకి వెళ్లడం లేదని ఇటీవల యూనిసెఫ్ వెల్లడించింది.

Tags

Next Story