నీళ్లు ఎక్కువ తాగడంతో మెదడు వాచి..

యాష్లే సమ్మర్స్ అనే 35 ఏళ్ల మహిళ ఇద్దరు పిల్లల తల్లి. అకస్మాత్తుగా ఆమెకు నీరసం, నిస్సత్తువగా అనిపించింది. నోరు పిడచకట్టుకుపోతోంది. బాగా దాహం అవుతున్నట్లు అనిపించింది. దాంతో 20 నిమిషాల్లో నాలుగు లీటర్ల నీరు తాగింది. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దాంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమె పరీక్షించిన వైద్యులు మెదడు వాచిందని గుర్తించారు. చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. యాష్లే ప్రాణాలు కోల్పోయింది. అధికంగా నీరు తాగడం కారణంగానే ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారు.
శరీరం సక్రమంగా పనిచేసేందుకు నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకని అవసరానికి మించి ఎక్కువ నీరు తాగకూడదు. నియంత్రణ చాలా ముఖ్యం. ఇండియానాకు చెందిన యాష్లే సమ్మర్స్ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి లేక్ ఫ్రీమాన్‌కు వెళుతుండగా, ఆమె అకస్మాత్తుగా డీహైడ్రేషన్‌కు గురైంది. తల తిరుగుతోందని, తలనొప్పిగా ఉందని భర్తతో చెప్పింది. దాహంగా ఉందని ఇరవై నిమిషాల వ్యవధిలో దాదాపు నాలుగు లీటర్ల నీరు తాగింది.
వాటర్ పాయిజనింగ్ అంటే ఏమిటి?
డీహైడ్రేషన్ అనేది సాధారణ సమస్య. అధికంగా నీరు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు పలుచనగా మారతాయి. ఈ పరిస్థితిని హైపోనాట్రేమియా అంటారు. నరాల సిగ్నలింగ్ నిర్వహించడానికి సోడియం అవసరం.
నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి అధికమవుతుంది. మిగులు ద్రవాలను బయటకు పంపే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, సోడియం స్థాయిలను పలుచన చేస్తుంది. నీటి ఎక్కువగా తీసుకుంటే విసుగు, తలనొప్పి, ఉబ్బరం వంటి లక్షణాలు తలెత్తుతాయి. మరికొన్ని సందర్భాల్లో గందరగోళం, కండరాల బలహీనత ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు.
ఎన్ని లీటర్ల నీరు ప్రమాదకరం?
మెడికల్ న్యూస్ టుడే 2013 అధ్యయనం ప్రకారం, మూత్రపిండాలు రోజుకు 20 నుంచి 28 లీటర్ల నీటిని పంప్ చేయగలవు. అయితే అవి గంటకు 0.8 నుండి 1.0 లీటర్ల నీటిని మాత్రమే పంపగలవు. "ఒక వ్యక్తి తక్కువ వ్యవధిలో 3-4 లీటర్ల నీటిని తాగితే హైపోనాట్రేమియా లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
ఎంత నీరు తాగితే సురక్షితం
వయస్సు, బరువు, శారీరక శ్రమ, పర్యావరణ పరిస్థితులు వంటి వివిధ కారకాలపై ఆధారపడి నీటి తీసుకోవలసి ఉంటుంది. రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోమని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. వ్యక్తిగత అవసరాలను బట్టి ఒక్కోసారి ఆ లెక్క మారవచ్చు. అవసరానికి మించి ఏది తీసుకున్నా అనర్థమే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏదీ అతిగా చేయకూడదు.. మనకి ఏం కావాలో మన శరీరం చెబుతుంటుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com