Gaza : గాజాలో నిరాశ్రయ జోన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 40 మంది మృతి
హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్నది. గాజాలోని మానవతా జోన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో 40 మంది మృతి చెందినట్లు సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ పేర్కొంది. మరో 60 మందికి పైగా ప్రజలు గాయపడినట్లు వెల్లడించింది. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ..
యుద్ధానికి ముందు గాజాలోని ఖాన్ యూనిస్‌లోని అల్-మవాసీ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం సురక్షిత మానవతా జోన్‌గా గుర్తించింది. దాంతో దాదాపు 10వేల మంది పాలస్తీనియన్లు అక్కడ ఆశ్రయం పొందారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ పలుమార్లు ఈ ప్రాంతంలో దాడులకు పాల్పడింది. కాగా తాజాగా సోమవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ మానవతా జోన్‌పై వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 40మంది మృతి చెందగా, గాయపడిన 60 మందికి పైగా ప్రజలను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సివిల్ డిఫెన్స్ అధికారి మహ్మద్ అల్-ముఘైర్ మంగళవారం ఉదయం పేర్కొన్నారు.
శిథిలాల్లో చిక్కుకున్న మరో 15 మందిని వెలికితీసేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైమానిక దాడిలో ప్రజలు ఆశ్రయం పొందుతున్న 40 కంటే ఎక్కువ టెంట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో జులైలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హమాస్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ దీఫ్ సహా 90మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
కాగా హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు చేశామని ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. గాజాలోని పలు ఉగ్రవాద సంస్థలు మానవతా జోన్‌పై దాడులకు పాల్పడుతూ వాటికి ఇజ్రాయెల్ దళాలను బాధ్యులను చేస్తున్నాయని మండిపడింది.
గాజాలో యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడిలో 1,205 మంది మరణించారు. ఈ దాడి సమయంలో మిలిటెంట్లు 251 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో 97మంది ఇప్పటికీ గాజాలోనే మగ్గిపోతున్నారు. మరో 33 మంది మృతి చెందినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
కాగా గాజాలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇప్పటివరకు దాదాపు 40,988 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మృతుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం యుద్ధం వల్ల సంవత్సరకాలంగా గాజాలోని 2.4 మిలియన్ల జనాభాలో అత్యధికులు కనీసం ఒక్కసారైనా నివాస ప్రాంతాలు మారుతూ ఉన్నారు. ప్రస్తుతం అల్‌మసి ప్రాంతంలో చదరపు కిలోమీటరులో 34,000 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. సేఫ్ జోన్‌ను 50 చదరపు కిలోమీటర్ల నుంచి 41కి కుదించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com