Indigo: ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో 400 మంది ఇండిగో ప్రయాణికుల నిరీక్షణ

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమానాల్లో ప్రయాణించాల్సిన 400 మంది ప్యాసింజర్లు ఇస్తాంబుల్ విమానాశ్రయంలో 24 గంటలపాటు చిక్కుకుపోయారు. తుర్కీయే, ఢిల్లీ, ముంబై మధ్య రాకపోకలు కొనసాగించాల్సిన రెండు ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాలు క్యాన్సిల్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, ముందస్తు సమాచారం లేకపోవడంతో ఈ విమానాలు రద్దయ్యాయి. దాంతో ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఇరుక్కుపోయిన ప్రయాణికులు ఆహారం, వసతులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. తమకు ఎదురైన ఇబ్బందులను ప్యాసింజర్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
ఇక, ఇండిగో ఎయిర్‌లైన్స్ కస్టమర్ సర్వీస్‌లో ఘోరంగా వైఫల్యం చెందిందని.. ప్రతి ప్రయాణీకుడికి ఆ సంస్థ క్షమాపణలు చెప్పడంతో పాటు తగిన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఓ ప్యాసింజర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అయితే, ఈ నెల ప్రారంభంలో ఎయిర్ హెల్ప్ అనే సంస్థ ప్రకటించిన జాబితాలో ఇండిగో విమానయాన సంస్థ 103వ ర్యాంక్ సాధించి ప్రపంచంలోని అంత్యంత చెత్త ఎయిర్‌లైన్స్‌గా నిలిచింది. 109 ఎయిర్ లైన్స్ లలో ఎయిర్ ఇండియా 61వ స్థానంలో, ఎయిర్ ఏషియా 94వ స్థానంలో కొనసాగుతున్నాయి.
కాగా నిర్వహణ కార్యకలాపాల కారణంగా విమాన సర్వీస్ ఆలస్యమవుతోందని ఇండిగో ప్రకటించింది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని, క్షమాపణలు కోరుతున్నట్టు ఇండిగో పేర్కొంది. ఈ మేరకు మోహతా అనే ప్రయాణికుడి సోషల్ మీడియా పోస్టుకు సమాధానం ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com