Terror Attacks : కశ్మీర్‌లో 48 పర్యాటక ప్రాంతాలు మూసివేత

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ క్రియాశీలం కావడంతో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న 87 పర్యాటక ప్రదేశాల్లోని 48 ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది. ఈ నెల 22న జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రాబోయే రోజుల్లో భద్రతా దళాలు, స్థానికేతర వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు చురుగ్గా ప్రణాళికలు రచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు, నిఘా సంస్థల నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది.
స్థానికేతర వ్యక్తులు, సీఐడీ సిబ్బంది, కాశ్మీర్ పండిట్లపై శ్రీనగర్, గుండేర్బల్ జిల్లాల్లో దాడులు చేయాలని పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రణాళికలు రచిస్తున్నట్టు కూడా నిఘా వర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడి తర్వాత లోయలో ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలగాలు ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగా ఉత్తర, మధ్య, దక్షిణ కాశ్మీర్‌లో చురుగ్గా ఉన్న ఉగ్రవాదులు మరింత ప్రభావవంతమైన దాడికి ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాల నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే, రైల్వేలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని నివేదిక హెచ్చరించింది. రైల్వే సెక్యూరిటీ సిబ్బంది బయటకు రాకుండా తమకు కేటాయించిన బ్యారక్‌లు, క్యాంపుల్లోనే ఉండాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com