Pak- Afghan war: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం ? కాల్పుల్లో 12 మంది పాక్ సైనికులు మృతి..

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ ఖయ్యానికి కాలుదువ్వే దాయాదిదేశం పాకిస్థాన్ ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ధీటుగా ఆఫ్ఘన్ స్పందించింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థన్, పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ 9న పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, పాక్టికాలో TTP చీఫ్ నూర్ వలీ మెహ్సుద్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. తాజాగా పాకిస్థాన్ వైమానిక దాడులకుఆఫ్ఘనిస్థన్ ప్రతీకారం తీర్చుకుంది. ఆఫ్ఘనిస్థన్ 201వ ఖలీద్ బిన్ వలీద్ ఆర్మీ కార్ప్స్ అక్టోబర్ 11న పాకిస్థాన్ సైనిక పోస్టులపై దాడులు ప్రారంభించింది.
ఆఫ్ఘనిస్తాన్‌లోని అధికార తాలిబన్ ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ఘనిస్థన్ దళాలు అనేక పాకిస్థానీ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. కునార్, హెల్మండ్ ప్రావిన్సులలోని ఆఫ్ఘన్ సరిహద్దులో ఒక్కొక్క పాకిస్థానీ పోస్టును ధ్వంసం చేశాయి. పక్తియా ప్రావిన్స్‌లోని రబ్ జాజీ జిల్లాలో ఈ ఉదయం నుంచి ఆఫ్ఘన్ సరిహద్దు దళాలు, పాకిస్థాన్ దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘన్, పాకిస్థాన్ దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని ఆఫ్ఘన్ కి చెందిన టోలో న్యూస్ ధృవీకరించింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ సైన్యం గణనీయంగా నష్టపోయిందని వెల్లడించాయి. ఆఫ్ఘన్ దళాలు పాకిస్థాన్ సైనికుల నుండి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాయని చెబుతున్నారు.. మరోవైపు.. తాలిబన్ పాలనలోని రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. “పాకిస్థాన్ ఆఫ్ఘన్ గగనతలాన్ని ఉల్లంఘించింది. డ్యూరాండ్ లైన్ సమీపానికి చెందిన పాక్టికా మార్గి ప్రాంతంలోని మార్కెట్‌పై బాంబు దాడి చేసింది. కాబూల్ సార్వభౌమ భూభాగాన్ని కూడా ఉల్లంఘించింది. ఇది హింసాత్మక, రెచ్చగొట్టే చర్య. ఆఫ్ఘన్ గగనతలాన్ని ఉల్లంఘించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా భూభాగాన్ని రక్షించుకోవడం మా హక్కు.” అని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com