Donald Trump: ట్రంప్‌పై కాల్పుల ఘటన: ఏడాది తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై వేటు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గతేడాది జరిగిన హత్యాయత్నం ఘటనలో సీక్రెట్ సర్వీస్ కీలక చర్యలు తీసుకుంది. భద్రతా వైఫల్యానికి బాధ్యులుగా తేలిన ఆరుగురు ఏజెంట్లను సస్పెండ్ చేసింది. ఈ దాడి జరిగి దాదాపు ఏడాది పూర్తికావస్తున్న సమయంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. పెన్సిల్వేనియాలోని బట్లర్ కౌంటీలో జరిగిన ఈ ఘటన పూర్తిగా తమ కార్యాచరణ వైఫల్యమేనని సీక్రెట్ సర్వీస్ అంగీకరించింది.
ఈ విషయాన్ని సీక్రెట్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మ్యాట్ క్విన్ అధికారికంగా వెల్లడించారు. బట్లర్‌లో జరిగిన ఘటనకు తమ సంస్థదే పూర్తి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన ఏజెంట్లకు భవిష్యత్తులో ఎలాంటి కీలక బాధ్యతలు అప్పగించబోమని ఆయన పేర్కొన్నారు.
2024 జులై 13న బట్లర్ కౌంటీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, థామస్ మాథ్యూ క్రూక్స్ అనే 20 ఏళ్ల యువకుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తూటా ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన సెనేట్ కమిటీ, సీక్రెట్ సర్వీస్ భద్రతా ఏర్పాట్లలో తీవ్ర లోపాలున్నాయని తన నివేదికలో ఎత్తిచూపింది. ఏజెంట్ల మధ్య సమన్వయ లోపం, బాధ్యతలపై స్పష్టత లేకపోవడమే దాడికి ఆస్కారం కల్పించిందని తప్పుబట్టింది.
ఈ హత్యాయత్నం తర్వాత ట్రంప్‌పై అమెరికాలో సానుభూతి వెల్లువెత్తడంతో పాటు ఆయన ప్రజాదరణ ఒక్కసారిగా పెరిగింది. ఇది అధ్యక్ష ఎన్నికల ఫలితాలను సైతం ప్రభావితం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com