22 Aug 2021 3:00 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / కాబూల్ ఎయిర్‌పోర్టు...

కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తొక్కిసలాట, ఏడుగురు మృతి..!

అఫ్గనిస్తాన్‌ రాజధాని కాబుల్‌లో బీభత్స వాతావరణం నెలకొంది. విమానాశ్రయం వద్ద మరోసారి తొక్కిసలాట జరిగింది.

కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తొక్కిసలాట, ఏడుగురు మృతి..!
X

అఫ్గనిస్తాన్‌ రాజధాని కాబుల్‌లో బీభత్స వాతావరణం నెలకొంది. విమానాశ్రయం వద్ద మరోసారి తొక్కిసలాట జరిగింది. ఘటనలో ఏడుగురు అఫ్గాన్‌ పౌరులు మరణించినట్టు బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలేస్‌ వెల్లడించారు. కాబుల్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులు సవాల్‌ విసురుతున్నాయని తెలిపారు. పరిస్థితుల్ని శాంతియుతంగా చక్కదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అమెరికా నిర్దేశించిన ఆగస్టు 31వ లోపు విదేశీయులు అందరినీ అఫ్గాన్‌ నుంచి తరలించడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మరికొంత కాలం ఉండేందుకు అమెరికన్లకు అనుమతి లభించే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితుల్లో బ్రిటన్‌ తరఫున పూర్తి సహాయ సహకారం ఉంటుందని అన్నారు.

అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్‌ అగ్రనేతలు మంతనాలు సాగిస్తున్నారు. కొంతకాలంగా కతార్‌లో తలదాచుకుంటున్న తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు... ఆ సంస్థ రాజకీయ విభాగాధిపతి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ కాబుల్‌ చేరుకున్నాడు. చైనా చెప్పినట్టు అఫ్గాన్‌లోని అన్ని జాతులతో కూడిన సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై ముఖ్య నేతలతో మంతనాలు సాగించాడు. త్వరలోనే జిహాదీ, రాజకీయ నేతలతోనూ బరాదర్‌ సమావేశం కానున్నట్టు తాలిబన్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

అఫ్గాన్‌ పౌర ప్రభుత్వానికి, అమెరికా బలగాలకు సహకరించిన వారు... తాలిబన్ల రాజ్యంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారంతా ఇప్పుడు దేశం నుంచి బయటపడాలని ఎదురు చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం వీరి తరలింపు ప్రాణాలతో చెలగాటమే అన్నారంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నివాసం నుంచి బయటకు వెళ్లి ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం అంటే జీవితంతో చెలగాటమాడినంత పనవుతోంది. కాబుల్‌లోని ఏ ప్రాంతం నుంచైనా విమానాశ్రయానికి చేరుకోవాలంటే సాయుధులైన తాలిబన్‌ ఫైటర్లతో కూడిన 20 చెక్‌పోస్టులను దాటుకొని వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఎవరిపైనైనా అనుమానం కలిగితే తాలిబన్లు అక్కడే కాల్చి చంపుతున్నారు.

విమానాశ్రయానికి చేరుతున్న క్రమంలో తాలిబన్లు తనను అడ్డుకున్నారని అమెరికాకు చెందిన ఓ మహిళ తెలిపారు. పక్కనున్న ఓ వ్యక్తిని అతని భార్యాపిల్లల ముందే కాల్చి చంపారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం తాను అఫ్గాన్‌కు చెందిన కొంతమంది పౌరులతో కలిసి ఓ ఇంట్లో తలదాచుకున్నానని తెలిపారు. బయటకు వస్తే కాల్చి చంపుతారని భయంగా ఉందన్నారు. ఎలాగైననా తమను రక్షించాలంటూ తీవ్ర దుఃఖంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను వేడుకున్నారు. ఈ మేరకు ఆమె ఓ ఆడియో సందేశాన్ని అమెరికాకు చేరవేశారు.

మరోవైపు.. అఫ్గన్‌లోని పరిణామాల మధ్య హక్కానీ నెట్‌వర్క్‌ నేతలు క్రియాశీలకంగా మారుతున్నారు. అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు, అఫ్గాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంస్థ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ఈ నెట్‌వర్క్‌ అగ్రనేత, అమెరికా మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా గుర్తింపు కలిగిన ఖలీల్‌ హక్కానీ కాబుల్‌ చేరుకున్నాడు. గతంలో ఖలీల్‌పై అమెరికా 37 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది.

అఫ్గానిస్తాన్‌ తాలిబన్‌ ముఠా చేజిక్కించుకున్నందున భారత ప్రభుత్వం అప్రమత్తం కావాలని మాజీ సైన్యాధిపతి జనరల్‌ శంకర్‌రాయ్‌ చౌధురి సూచించారు. జమ్మూ-కశ్మీర్‌లో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని అన్నారు. అందువల్ల ఆ రాష్ట్ర ప్రజలకు కేంద్రం మరింత చేరువ కావాలని తెలిపారు. భారత్‌ లౌకిక ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందన్న భరోసా నింపాలని సూచించారు. జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న 1990లలో శంకర్‌ రాయ్‌ చౌధురి భారత సైన్యంలోని కీలకమైన '16వ కోర్‌'కు నేతృత్వం వహించారు.

Next Story