Assam: అస్సాంలో రైలు ప్రమాదం..

పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ 8 బోగీలు

దేశంలో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదం మరువక ముందే అస్సాంలో మరో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి. బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వేశాఖ తెలిపింది.

గురువారం ఉదయం అగర్తల నుంచి ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3:55 గంటలకు అస్సాంలోని డిబాలాంగ్ స్టేషన్ దగ్గర పట్టాలు తప్పిందని రైల్వే ప్రతినిధి తెలిపారు. లండింగ్ డివిజన్ పరిధిలోని లుమ్‌డింగ్-బర్దర్‌పూర్ హిల్ సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. పవర్ కార్, రైలు ఇంజిన్‌తో సహా ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ కూడా పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ఇటీవల కూడా తమిళనాడులో ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు గానీ.. పలువురు గాయపడ్డారు. వరుస ప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Tags

Next Story