China: చైనాలో ఘోరం. . విద్యార్థి కత్తికి 8 మంది బలి
చైనాలో యువకుల ఉన్మాద చర్యలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. చైనాలోని దక్షిణ నగరమైన జూహైలో ఇటీవల జరిగిన కారు బీభత్స ఘటన మరువక మునుపే తాజాగా తూర్పు నగరం వుషీలో మరో ఉన్మాద ఘటన చోటుచేసుకుంది. చైనాలో ఓ యువకుడు శనివారం ఉన్మాదిగా ప్రవర్తించి ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు. మరో 17 మందిని గాయపర్చాడు. ఈ ఘటన చైనా తూర్పు నగరం వుషీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే..21 సంవత్సరాల యువకుడు కళాశాల క్యాంపస్‌లో కత్తితో వీరంగం సృష్టించాడు. విచక్షణారహితంగా కత్తితో విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వుషీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ విద్యార్ధి అని, పరీక్షలో ఫెయిల్ కావడం, డిగ్రీ సర్టిఫికెట్ అందుకోలేకపోవడం, ఇంటర్న్‌షిప్ ఉపకార వేతనం అందకపోవడంతో అసంతృప్తితో ఉన్మాదిగా ప్రవర్తించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చైనాలోని దక్షిణ నగరమైన జూహైలో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఓ యువకుడు ఇటీవల జూవైలో ఎస్‌యూవీ కారుతో బీభత్సం సృష్టించాడు. కారును వేగంగా నడుపుతూ పాదచారులపై దూసుకువెళ్లాడు. దీంతో 30 మంది మృతి చెందారు. మరో 43 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన ఉన్మాది.. తర్వాత కత్తితో తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆతన్ని ఆసుపత్రిలో చేర్పించగా, ప్రస్తుతం అతను కోమాలో ఉన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com