Iran: ఇరాన్‌లో 9 మంది పాకిస్థానీల కాల్చివేత, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Iran: ఇరాన్‌లో 9 మంది పాకిస్థానీల కాల్చివేత, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
ఇంట్లోకి చొరబడి మరీ కాల్చి చంపిన గుర్తు తెలియని దుండగులు

పాకిస్థాన్‌కు చెందిన 9 మంది కార్మికులు ఇరాన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. కల్లోలిత ప్రాంతమైన ఇరాన్‌ ఆగ్నేయ సరిహద్దుల్లోని సిస్తాన్‌-బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని సరవణ్‌ నగరం సమీపంలో ఈ దారుణం జరిగినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. శనివారం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి9మందిని కాల్చి చంపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.

ఇరాన్‌లో తమ దేశానికి చెందిన తొమ్మిది మంది పౌరులు హత్యకు గురికావడంపై పాకిస్థాన్‌ స్పందించింది. తమ దేశీయుల్ని కాల్చి చంపడంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన వారిని పట్టుకోవాలని పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి ముంతాజ్‌ జహ్రా బలోచ్‌ ఆదివారం డిమాండ్‌ చేశారు. ఈ భయానక ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఇరాన్‌కు పాక్‌ రాయబారిగా ఉన్న మహ్మద్‌ ముదాస్సిర్‌ అన్నారు.


ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ చర్చల కోసం ఇస్లామాబాద్‌లో పర్యటించడానికి ఒక రోజు ముందు ఈ ఘటన జరుగడం గమనార్హం. కాల్పుల ఘటనను ఖండిస్తున్నామని, రెండు దేశాల మధ్య సోదర సంబంధాన్ని దెబ్బతీసేందుకు విధ్వంసక శక్తులు చేస్తున్న ప్రయత్నాలను అనుమతించేది లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నజీర్‌ కన్నాని అన్నారు. ఉద్రిక్తతలు చల్లార్చాలని, దౌత్య కార్యకలాపాలను పునరుద్ధరించుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు రెండు దేశాలు గత సోమవారం ప్రకటించగా.. తాజాగా కాల్పుల ఘటన చోటుచేసుకొన్నది.

బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ ఈ నెల 16న క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. జైష్‌ అల్‌ అదిల్‌ స్థావరాలే లక్షంగా దాడులు చేసినట్టు ఇరాన్‌ వెల్లడించింది. ఇరాన్‌ దాడుల్లో ఇద్దరు పిల్లలు మరణించారని పాక్‌ పేర్కొన్నది. తమ దేశంలోని ఇరాన్‌ రాయబారిని బహిష్కరించిన పాక్‌.. ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కు పిలిచింది. ఇరాన్‌ దాడులకు ప్రతిగా పాక్‌ కూడా ఈనెల 18న సిస్థాన్‌-బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని ఉగ్రవాదుల స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story