Sudan Crises: ఆకలితో ప్రాణాలు కోల్పోయిన 500 మంది చిన్నారులు

ఎటు చూసినా యుద్ధం. కళ్ళు తెరిచి మూసేలోగా మరణం. ప్రాణాలు కోల్పోయిన వారు ఐదువేల మంది. ప్రాణ భయంతో వలసలు పోయినవారు కొన్ని లక్షల మంది. కరువుకు కాస్త దూరంలో మరో అరవై లక్షల మంది. సూడాన్‌లో పారామిలిటరీ ఫోర్స్, సైన్యం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో సూడాన్‌లో సామాన్యులకు మాత్రం ఆకలి మిగిల్చింది కేకలకు మిగిల్చింది. అధికారం కోసం నేతలు చేస్తున్న పోరాటంతో ప్రజలు బలి అవుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు.
సూడాన్‌లో కొన్ని నెలలుగా జరుగుతున్న అంతర్యుద్ధంతో తీవ్రమైన దారుణ పరిస్థితులు తలెత్తాయి. దీంతో 500 మంది చిన్నారులు ఆకలితో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక స్వచ్ఛంద సంస్థ ఒకటి వెల్లడించడం సంచలనంగా మారింది. వీరితోపాటు మరో 31 వేల మంది పిల్లలు పోషకాహార లోపంతో అనారోగ్యం పాలయ్యారని తెలిపింది.
దశాబ్దాల తరబడి నియంత పాలనలో మగ్గిపోయిన సూడాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినా అది ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత ఇద్దరు కలిసి దేశాన్ని ఏలి చివరికి వారిద్దరి మధ్యే యుద్ధం మొదలైంది. ఈ అంతర్యుద్ధంతోనే సూడాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఏప్రిల్‌లో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి నుంచి ఇప్పటివరకు ఆకలితో దాదాపు 500 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికంగా పనిచేసే సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. మరోవైపు. 31వేల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నప్పటికీ వారికి చికిత్స అందడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే చిన్నారుల మరణాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సేవ్ ది చిల్డ్రన్ సంస్థ.. ఈ స్థాయిలో చనిపోతారని తాము ఎన్నడూ ఊహించలేదని పేర్కొంది. ఘర్షణల కారణంగా అనేక మంది ప్రజలకు తాగు నీరు, విద్యుత్ సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే సూడాన్‌లో ఆరోగ్య వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలిపోయిందని తెలుస్తోంది.
అసలు సూడాన్‌లో ప్రస్తుత ఘర్షణలకు కారణం పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనే. దీంతో అక్కడ సూడాన్ సైన్యానికి పారామిలిటరీ బలగాల మధ్య యుద్ధానికి దారితీసింది. ఏప్రిల్ 15 వ తేదీన మొదలైన ఈ అంతర్యుద్ధంలో దాదాపు 4 వేల మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంద. అయితే నిజానికి ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని అంచనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com