చైనా కమ్యూనిస్టు పార్టీలోకి జాకీ చాన్!

Jackie Chan File Photo
Jackie Chan: చైనాకు చెందిన ప్రముఖ సినీ నటుడు జాకీ చాన్.. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చైనా సినీ ప్రముఖుల మధ్య జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో జాకీ చాన్ తన మనసులోని మాట బయటపెట్టారని ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. సీపీసీ శతాబ్ది వేడుకల సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన ప్రసంగంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగిందని, అందులో జాకీ చాన్ మాట్లాడుతూ సీపీసీ విధానాలను ప్రశంసించారని తెలిపింది.
సీపీసీ గొప్పతనం కళ్లముందే కనపడుతోందని. అది ఏం చెబుతోందో, ఏం వాగ్దానం చేస్తోందో, వాటిని తప్పక నెరవేరుస్తుందన్నారాయన. అందుకు వందేళ్లు అవసరం లేదని కొన్ని దశాబ్దాల సమయం చాలని, తాను ఆ పార్టీ సభ్యుణ్ని కావాలనుకుంటున్నానంటూ జాకీ చాన్ వ్యాఖ్యానించినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
హాంకాంగ్‌లో నివసిస్తున్న 67 ఏళ్ల జాకీ చాన్ ముందు నుంచీ సీపీసీకి మద్దతు పలుకుతున్నారు. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యవాదుల నిరసనను అణచివేయడానికి సీపీసీ చేపట్టిన చర్యలనూ ఆయన సమర్థించారు. ఈ విషయంలో ఆయన తీవ్ర విమర్శలకు గురయ్యారు. వివిధ రంగాల్లోని ప్రముఖులను సలహాదారులుగా నామినేట్ చేస్తూ సీపీసీ ఏర్పర్చిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్'లో జాకీ చాన్ సభ్యుడిగా కొనసాగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com