అఫ్గానిస్తాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు.. తుపాకులతో వీరంగం..!

అఫ్గానిస్తాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు.. తుపాకులతో వీరంగం..!
మంగళవారం నిరసనకారులపై కాల్పులు జరిపిన తాలిబన్లు.. నేడు దేశ స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీపై తూటాల వర్షం కురిపించారు.

తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో ముష్కరుల విధ్వంసకాండ మొదలైంది. మంగళవారం నిరసనకారులపై కాల్పులు జరిపిన తాలిబన్లు.. నేడు దేశ స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీపై తూటాల వర్షం కురిపించారు. ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా అఫ్గానిస్థాన్‌లో ఏటా ఆగస్టు 19న స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకుంటారు. కానీ... ఈ సారి తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు వేడుకకు దూరంగా ఉన్నారు. అసదాబాద్‌ నగరంలో కొందరు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. ఆగ్రహించిన తాలిబన్లు... వారిపై కాల్పులు జరిపారు. తుపాకుల శబ్దంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. కాల్పులు, తొక్కిసలాట కారణంగా పలువురు మృతి చెందినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.

ముష్కరుల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లాలని ప్రయత్నిస్తున్న అఫ్గాన్‌ పౌరులపై తాలిబన్లు దాడులు చేస్తున్నారు. విమానాశ్రయం లోపలికి వెళ్లకుండా ఇనుపకంచెలు అడ్డుపెట్టారు. నిస్సహాయస్థితిలో ఉన్న ప్రజలు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తమను కాపాడాలంటూ ఎయిర్‌పోర్టులోని యూఎస్‌, యూకే దళాల్ని వేడుకుంటున్నారు. కనీసం తమ తర్వాతి తరం వారినైనా రక్షించుకోవాలన్న ఆరాటంతో ఇనుప కంచెలపై నుంచి పిల్లలను లోపలికి విసిరేస్తురు. ఆ హృదయ విదారక ఘటనలు చూస్తుంటే దుఖం పొంగుకొస్తోందని బ్రిటీష్‌ ఆర్మీ సీనియర్‌ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు రోజుల క్రితం వరకు శాంతిమంత్రం జపించిన తాలిబన్లు... మళ్లీ తమ సహజ స్వభావాన్ని బయటపెడుతున్నారు. వ్యతిరేక ఆందోళనలు చేసిన వారిపై కాల్పులతో తెగబడుతున్నారు. దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రయత్నించిన వారిని చితకబాదుతున్నారు. తాలిబన్ల అరాచకాలతో అఫ్గాన్‌ వాసులు భయాందోళనలో కూరుకుపోయారు. కాబుల్‌ను ఆక్రమించాక.. ఓ వినోద పార్కులో తాలిబన్లు చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. బొమ్మ కార్లు ఎక్కి సరదాగా గడిపారు. అదే పార్కుకు వారు నిప్పంటించడంతో అక్కడున్న సామగ్రి మొత్తం మంటల్లో కాలిపోతున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. విగ్రహాలు, బొమ్మలు ఇస్లామిక్‌ ఆచారాలకు వ్యతిరేకమని.. అవి ఉండటం వల్లే పార్కును అగ్నికి ఆహుతి చేశామని తాలిబన్లు చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రతీకారం జోలికి వెళ్లబోమని కొన్నాళ్లుగా నీతులు చెబుతున్న తాలిబన్లు.. సెంట్రల్‌ బమియాన్‌ ప్రావిన్సులో అబ్దుల్‌ అలీ మజారీ అనే ప్రముఖ నేత విగ్రహాన్ని పేల్చేశారు. 1990లో అఫ్గాన్‌ అంతర్యుద్ధం సమయంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడారు. 1996లోనే మజారీ ప్రాణాలను వారు బలితీసుకున్నారు. అఫ్గాన్‌లో జిల్లా గవర్నర్లుగా ఉన్న అతికొద్ది మంది మహిళల్లో ఒకరైన సలీమా మజారీ కూడా తాలిబన్ల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అటు.. అఫ్గానిస్తాన్‌లో రక్తపాతాన్ని నివారించేందుకే దేశం విడిచి దుబాయ్‌ వెళ్లిపోయానని మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ తెలిపారు. సొంత దేశ ప్రజలు, అధికారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో బుధవారం ఫేస్‌బుక్‌ వేదికగా ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అందరూ ఆరోపిస్తున్నట్టుగా తాను బ్యాగ్‌ల నిండా డబ్బులేమీ తీసుకెళ్లలేదని, కట్టుబట్టలతో దేశాన్ని విడిచానని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story