Afghanistan: బొమ్మలకూ ముసుగేశారు...

ఆఫ్గనిస్థాన్ లో తాలిబన్ పైత్యానికి హద్దే లేకుండా పోతోంది. మానవహక్కులను అత్యంత హీనమైన స్థాయికి దిగజార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మూర్ఖపు రాజ్యం తాజాగా మరో చర్యకు పాల్పడింది.
దేశంలోని దుకాణాలన్నింటిలోనూ ప్రదర్శన కోసం ఉంచిన బొమ్మల ముఖాలకు పరదా వేయాల్సిందిగా తాలిబన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దుకాణదారులందరూ మెనెకిన్ లకు పరదాలు తగిలించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కొందరు ప్రత్యేకమైన గుడ్డలతో బొమ్మల ముఖాలను మూసివేయగా, మరికొందరు పాలిథీన్ కవర్లు, ఇంకొంతమంది సిల్వర్ కాయిల్స్ తగిలించేశారు. దేశ రాజధాని కాబుల్ లో ఎన్నో దుకాణాల్లో ఈ విధంగా ముఖాలను కప్పిన బొమ్మలు కనిపిస్తున్నాయి. కాగా, గతంలో మొత్తానికి అమ్మాయిల బొమ్మలనే తీసేయాలని, లేదా పూర్తిగా తగలబెట్టేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఈ అంశంపై అంతర్జాతీయ సమాజం నిప్పులు చెరుగుతోంది. ఇప్పటికే ఆఫ్ఘన్ లో మహిళల జీవన ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని, ప్రభుత్వం మహిళా శక్తికి కాలుకింద అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని దుమ్మెత్తిపోస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com