Afghanistan crisis: మొదలైన తాలిబన్ల అరాచకాలు..ప్రజల్లో భయంభయం

Afghanistan crisis: మొదలైన తాలిబన్ల అరాచకాలు..ప్రజల్లో భయంభయం
Afghanistan crisis: రాబోయే రోజుల్లో ఆఫ్గాన్‌ ఎలా ఉండబోతోందో ఇప్పుడిప్పుడే క్లియర్ పిక్చర్ కనబడుతోంది.

రాబోయే రోజుల్లో ఆఫ్గాన్‌ ఎలా ఉండబోతోందో ఇప్పుడిప్పుడే క్లియర్ పిక్చర్ కనబడుతోంది. 20 ఏళ్ల క్రితం ఎలాంటి అరాచకరాలు చేసారో...ఇప్పుడూ వాటినే కొనసాగిస్తున్నారు. అందుకే, మమ్మల్ని నమ్మండి అనే మాటలను ఆ దేశ ప్రజలు నమ్మడం లేదు. ఇప్పటికే ఆఫ్గాన్‌లో తాలిబన్ల విశ్వరూపం మొదలైంది. ఏ చిన్న నిరసన తెలిపినా కాల్చి పారేస్తున్నారు. నిన్న ఇద్దరిని చంపేశారు. తాలిబన్ వ్యతిరేకుల విగ్రహాలను కూల్చేస్తున్నారు. ఓ పార్కులో బొమ్మల కార్లతో చిన్న పిల్లలు ఆడుకుంటున్నారని తెలియగానే.. ఆ పార్కును తగలబెట్టారు. ఇదేమని అడిగితే.. విగ్రహాలు, బొమ్మలు ఇస్లామిక్‌ ఆచారాలకు వ్యతిరేకమని.. అవి ఉండటం వల్లే పార్కును తగలబెట్టామని చెప్పుకొచ్చారు.

ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. తల మీద ఏకే-47 గురిపెట్టే సరికి.. ప్రాణభయంతో ఉన్నదంతా ఇచ్చేస్తున్నారు ఆఫ్గాన్లు. చాలామంది ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను వారి కంట కనబడకుండా దాచేసుకుంటున్నారు. గతంలో పది, పన్నెండేళ్లు దాటిన ఆడపిల్లలు కనిపిస్తే లాక్కెళ్లిపోయారు. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తుండడంతో.. ఆఫ్గాన్లు భయంభయంతో బతుకుతున్నారు.

మమ్మల్ని నమ్మండి అనే మాటలపై ప్రపంచ దేశాలు సైతం అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే, ఉగ్రవాద నెట్‌వర్క్‌ నడుపుతున్న వాళ్లు కూడా తాలిబన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించబోతున్నారు. తాలిబన్ల సుప్రీం కమాండర్‌ హైబతుల్లా.. సమగ్ర పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితం ముల్లా ఒమర్‌ ఎలా అయితే ఆఫ్గాన్‌ను అరాచకంగా నడిపించాడో.. అదే ఫార్ములాను హైబతుల్లా తీసుకోబోతున్నారు. ఈ హైబతుల్లా కింద ఉండే ముగ్గురు ఉప నాయకుల్లో ఒకరికి దేశాధ్యక్షుడి బాధ్యతలు ఇస్తారు. ముల్లా ఒమర్‌ కొడుకు యాకూబ్‌, హక్కానీ ఉగ్రవాద నెట్‌వర్క్‌ నేత సిరాజుద్దీన్‌, తాలిబన్‌ వ్యవస్థాపక సభ్యుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో బరాదర్‌కే ఆఫ్గాన్ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది.

తాలిబన్ల ప్రభుత్వంలో హక్కానీ నెట్‌వర్క్‌కు భాగస్వామ్యం ఉంటుందని తెలుస్తోంది. హక్కాని నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది. ఒకవేళ ఈ సంస్థను కూడా ప్రభుత్వంలో కలుపుకుంటే.. అఫ్గాన్‌పై విధించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. అంతర్జాతీయంగా కూడా ఆఫ్గాన్‌కు సాయం అందకుండా చేయనుంది అమెరికా.

ఇదిలా ఉంటే.. తాలిబన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అమ్రుల్లా సిద్ధమవుతున్నారు. ఆఫ్గాన్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సైతం.. కుప్పకూలిన ప్రభుత్వంలోని కీలక నేతలు ఒకదగ్గరికి చేర్చి మీటింగ్ పెట్టారు. పంజ్‌షేర్‌ లోయలో రక్షణ మంత్రి జనరల్‌ బిస్మిల్లా, మరో కీలక నేత అహ్మద్‌ మసూద్‌తో చర్చలు జరిపారు. తాలిబన్లకు ఎదురు తిరిగేందుకు రెడీ అవుతున్నారు. అధ్యక్షుడు ఘనీ తిరిగి అఫ్గాన్‌ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచి పాలన అందిస్తామని ప్రపంచదేశాలకు కలరింగ్ ఇచ్చేందుకు.. తాలిబన్లు హమీద్‌ కర్జాయ్‌, మరో కీలక నేత అబ్దుల్లా అబ్దుల్లాతో సమావేశం అయ్యారు. ఇందుకోసం ఉగ్రవాద సంస్థ నడుపుతున్న హక్కానీ నెట్‌వర్క్‌ సీనియర్‌ నేత అనస్‌ను రంగంలోకి దించారు. వీరితో పాటు ఘనీ సైతం చర్చల్లో పాల్గొనవచ్చని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story