Taliban: ఎముకలు విరగకుంటే, రక్తం కనిపించకుంటే గృహహింసకాదట.. ఎక్కడో తెలుసా

Taliban: ఎముకలు విరగకుంటే, రక్తం కనిపించకుంటే  గృహహింసకాదట.. ఎక్కడో తెలుసా
X
గృహహింసను చట్టబద్దం చేసిన ఆఫ్ఘనిస్థాన్!

ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే చదువుకు, ఉపాధికి మహిళలను దూరం చేసిన తాలిబన్లు.. తాజాగా గృహహింసకు మద్దతిచ్చేలా అమానవీయ నిబంధనలను అమల్లోకి తెచ్చారు. పురుషులు తమ ఇంట్లోని మహిళలను, పిల్లలను శారీరకంగా హింసించినా అది నేరం కాదని కొత్త పీనల్ కోడ్‌లో పేర్కొనడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

విస్తుపోయే నిబంధనలు..

ఇంట్లో మగవారు మహిళలను కొట్టినప్పుడు రక్తం రాకపోయినా, ఎముకలు విరగకపోయినా దానిని నేరంగా పరిగణించరు. అంటే, గాయాలు బయటకు కనిపించనంత వరకు ఎంత హింసించినా అది చట్టబద్ధమే. ఒకవేళ భర్త దాడిలో ఎముకలు విరిగితే, బాధితురాలు దానిని కోర్టులో నిరూపించగలిగితే నిందితుడికి 15 రోజుల జైలు శిక్ష పడుతుంది. అయితే, బాధిత మహిళ కోర్టుకు వెళ్లాలంటే ఆమె వెంట తప్పనిసరిగా ఒక పురుషుడు ఉండాలి.

న్యాయమూర్తికి తన గాయాలను చూపేటప్పుడు కూడా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచుకోవాలనే నిబంధన విధించారు. ఈ మేరకు కొత్త నిబంధనలపై ఆఫ్ఘన్ సుప్రీంలీడర్ హిబుతుల్లా అఖుంద్జాదా సంతకాలు చేశారు. ఇది బాధితులకు న్యాయం అందకుండా చేసే కుట్రగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భర్త అనుమతి లేకుండా భార్య బంధువుల ఇంటికి వెళ్తే సదరు మహిళకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు.

వర్గాల వారీగా శిక్షలు..

ఆర్టికల్ 9 ప్రకారం ఆఫ్ఘన్ సమాజాన్ని నాలుగు వర్గాలుగా (మత పెద్దలు, ఉన్నత వర్గం, మధ్యతరగతి, దిగువ తరగతి) విభజించారు. నేర తీవ్రతతో సంబంధం లేకుండా నేరస్థుడు ఏ వర్గానికి చెందినవాడనే అంశంపై ఆధారపడి శిక్షలు మారుతుంటాయి. ఇది సామాన్యులపై మరింత అణచివేతకు దారితీసే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్జాతీయ ఆందోళన..

2009లో అప్పటి ప్రభుత్వం మహిళా రక్షణ కోసం తెచ్చిన చట్టాలను ఈ కొత్త పీనల్ కోడ్ రద్దు చేసింది. 2021లో అధికారం దక్కించుకున్నప్పటి నుండి బాలికల విద్య, ఉపాధి, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్న తాలిబన్లు, ఇప్పుడు గృహహింసను సమర్థించడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకుని ఈ అరాచక చట్టాలను అడ్డుకోవాలని కోరుతున్నాయి.

Tags

Next Story