Africa: ఆఫ్రికాలో స్కూల్ కట్టించిన కేరళ జంట...

Africa: ఆఫ్రికాలో స్కూల్ కట్టించిన కేరళ జంట...
చదువు కోసం పరితపిస్తున్న పిల్లల కోసం భారత జంట సహాయం; అన్నీ తామై బడి కట్టించి...

తూర్పు ఆఫ్రికాలో వెనుకబడిన ప్రాంతంలో చదువు కోసం పరితపిస్తున్న చిన్నారులు ఆ యువకుడిని ఆకట్టుకున్నారు. సరైన వసతులు లేకపోయినా చదువుకోవాలన్న వారి కోరిక అతడిని నిలబడనీయలేదు. చిన్న గుడిసెలో సాగుతున్న వారి బడిని చూస్తుంటే మనసును ఎవరో మెలేసినట్లు బాధపడేవాడు. ఒకరోజు ఇక ఇలా బాధపడుతూ కూర్చోవడంలో అర్ధంలేదని భావించాడు. తన మనసులోని మాటను స్నేహితుడితో పంచుకున్నాడు. అతడు అందించిన ఆర్ధిక సహాయం, స్థానికుల తోడ్పాటు, అంతకు మించి జీవిత సహచరి అందించిన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. ఇప్పుడు ఆఫ్రికాలోని ఆ కుగ్రామంలో చిన్నారులు అన్ని వసతులతో కూడిన పాఠశాలలో ఏ చీకూచింతా లేకుండా హాయిగా చదువుకుంటున్నారు. తనకు ఏమీ కానీ ఆ చిన్నారులకు ఇంత సహాయం చేసిన యువకుడు మన భారతీయుడు కావడం విశేషం.

కేరళలోని మల్లపురానికి చెందిన అరుణ్(30) ఓ నిర్మాణ సంస్థ ఉద్యోగిగా నాలుగేళ్ల క్రితం తూర్పు ఆప్రికాలోని మలావీకి వెళ్లాడు. రెండేళ్ల క్రితం ఓ డ్యామ్ నిర్మాణ పనుల నిమిత్తం చిసాసలా అనే గ్రామానికి వెళ్లాడు. అక్కడే తాటాకులతో కట్టిన ఓ పూరి గుడిసెలో సాగుతున్న ప్రాథమిక బడిని చూసి అతడి మనసు చలించిపోయింది. కేరళలోని అతిడి స్కూల్ గుర్తుకువచ్చి... ఇక్కడ కూడా ఓ స్కూల్ నిర్మించాలనే ఆలోచన పుట్టింది. గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక బడికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న చిన్నారుల కష్టం చూడలేకే తానీ నిర్ణయం తీసుకున్నట్లు అరుణ్ చెబుతున్నాడు. అయితే పూర్తిస్థాయిలో పాఠశాల పునర్నిర్మాణం చేయాలని అనుకోలేదని, కేవలం ప్లాస్టిక్ షీట్ తో షెడ్ ను నిర్మించాలని అనుకున్నాడట. కానీ, క్రమంగా పాఠశాల నిర్మాణం ఆలోచన బలపడిందని చెబుతున్నాడు. దుబాయ్ లో ఉంటోన్న ఆషిక్ అనే మరో స్నేహితుడు అందించిన ఆర్థిక సహాయంతో పాఠశాల నిర్మాణ పనులు మొదలుపెట్టాడు. ఇక అరుణ్ తలపెట్టిన కార్యానికి స్థానికులు స్వచ్ఛంధంగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నిర్మాణానికి కావాల్సిన ఇటుకులను తామే స్వయంగా తయారు చేసి ఇచ్చారు. ఈ క్రమంలోనే భారత్ వచ్చి పెళ్లి చేసుకుని తిరిగి వెళ్లిన అరుణ్ కు కొత్త పెళ్లి కూతురు కొండంత బలాన్ని ఇచ్చింది. భర్త చేపట్టిన యజ్ఞంలో తన వంతు సహాయంగా అన్ని బాధ్యతలనూ పంచుకుంది. అయితే ఈ క్రమంలో వారికి ఆర్ధిక సహాయం చేసేందుకు ఎన్నో నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. కానీ, ఎవరి సహాయం తీసుకోకూడదని అరుణ్ దంపతులు నిర్ణయించుకున్నారు. అల ా 18నెలల్లో పాఠశాల నిర్మాణం పూర్తిచేసి ఫిబ్రవరి 17న లాంఛనంగా ప్రారంభించారు. అంతేకాదు, ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు కూడా లభించడంతో చిన్నారులు ప్రతీ ఏటా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి మాత్రమే పరీక్షలు రాయాల్సి న అవసరం తప్పింది. ఇక ఈ స్కూల్ కు కేరళ బ్లాక్ అని నామకరణం చేశారు. కేవలం స్కూల్ నిర్మాణం మాత్రమే కాదు. స్థానిక ప్రజల్లో అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్న ఈ మళయాళీ దంపతులు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags

Next Story