Nasa: ముగిసిన నాసా ఇంజెన్యూటీ ప్రస్థానం..

అంగారక గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగం ఇంజెన్యూటీ ప్రయాణం ఇక ముగిసింది. అంగారక గ్రహంపై పరిశోధనలకు మూడేండ్ల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ పంపిన బుల్లి హెలికాప్టర్ ‘ఇంజెన్యూటీ’ కథ ముగిసింది. ఇతర గ్రహంపై ఎగిరిన తొలి హెలికాప్టర్‌గా చరిత్ర సృష్టించిన ‘ఇంజెన్యూటీ’ ప్రస్తుతం ఎగరలేని స్థితిలో ఉన్నట్టు నాసా ప్రకటించింది. ఈ నెల 18న దీన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తుండగా రోటర్ బ్లేడ్లు దెబ్బతినడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రస్తుతం ‘ఇంజెన్యూటీ’ సాధారణ స్థితిలో నిలబడే ఉన్నప్పటికీ రోటర్ బ్లేడ్లు దెబ్బతినడం వల్ల పైకి ఎగరలేకపోతున్నదని, దీంతో ఆ హెలికాప్టర్ ప్రయాణం ముగిసినట్టేనని వివరించింది.
‘పర్సెవరెన్స్’ రోవర్ ద్వారా 2021 ఫిబ్రవరిలో అంగారక గ్రహంపైకి చేరిన ఈ హెలికాప్టర్ ఇప్పటికే అంచనాలకు మించి పనిచేసినట్టు నాసా పేర్కొన్నది. ఇప్పటివరకు ఇది అరుణ గ్రహ వాతావరణంలో 72 సార్లు ఎగిరిందని, ఇది అనుకున్న దానికంటే 14 సార్లు ఎక్కువని తెలిపింది. ఎత్తుపల్లాలతో ఎగుడుదిగుడుగా ఉండే అంగారక గ్రహ ఉపరితలంపై సరైన ల్యాండింగ్ ప్రదేశాలను తనంతట తానే ఎంపిక చేసుకోగలిగేలా ‘ఇంజెన్యూటీ’ని గత కొన్నేండ్లలో ఎంతో అప్‌గ్రేడ్ చేశామని, దీంతో ఆ హెలికాప్టర్ ఓ సందర్భంలో అరు ణ గ్రహంపై శీతాకాలంలో ధూళి తుఫాను అనంతరం తనంతట తాను శుభ్రం చేసుకోవడంతోపాటు సెన్సర్ సమస్యను కూడా చక్కదిద్దుకోగలిగిందని నాసా వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com