India -France: భారత్ కు ఫ్రాన్స్ బంపర్ ఆఫర్

India -France: భారత్ కు ఫ్రాన్స్ బంపర్ ఆఫర్
భారత్‌కు యుద్ధ విమాన ఇంజిన్‌ టెక్నాలజీ ఇవ్వనున్న ఫ్రాన్స్

మోదీ ఫ్రాన్స్ పర్యటనకు ముందే ఇరు దేశాలమధ్య కీలక ఒప్పందాలు జరగుతున్నాయి. ఫ్రాన్స్ కు చెందిన అగ్రగామి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ సంస్థ సఫ్రాన్, భారత్ చేపడుతున్న అడ్వాన్స్ డ్ మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో పాలుపంచుకోనుంది. ఈ మేరకు సంయుక్త భాగస్వామ్యానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆమోదం తెలిపినట్టు సమాచారం.

ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రక్షణ శాఖ ఒప్పందానికి సంబంధించి ఈ కీలక ప్రకటన చేసింది. భారత్‌తో కలిసి మల్టీ రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించింది. ఈ ఇంజిన్ల తయారీ ప్రక్రియను పూర్తిగా ఇండియాలోనే చేపట్టనున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికాతో కుదిరిన GE-414 ఇంజిన్ డీల్‌ తరహాలోనే ఈ ఒప్పందం కూడా ఉండనుంది.





ఎంతో కీలకమైన జెట్ ఇంజిన్ ఒప్పందం మోదీ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఆధునిక యుద్ధ విమానాలకు ఎంతో ముఖ్యం అయిన జీఈ-414 ఇంజిన్లను ఇకపై భారత్ లోనే తయారుచేసేందుకు అవసరమైన టెక్నాలజీని అమెరికా 100 శాతం బదిలీ చేయనుంది. ఇప్పుడు భారత్-ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం కూడా అలాంటిదేనని భావిస్తున్నారు.

ఫ్రాన్స్ తో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే 100 కేజీల న్యూటన్ ఇంజిన్ పూర్తిగా భారత్ లోనే తయారుకానుంది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డిజైనింగ్‌ నుంచి ఇంజన్‌ను ధృవీకరించే వరకు మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి సంతకం చేసిన తేదీ నుంచి 10 సంవత్సరాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఒప్పందంలో భాగంగా సఫ్రాన్ భారతదేశంలో తమ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. జెట్ ఇంజిన్ కాంట్రాక్ట్‌కు భారత్ భారీ మొత్తంలో చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.





ఈ నెలలో 14 న జరగనున్న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. ఈ ఏడాదితో భారతదేశం- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మోదీ ఫ్రాన్స్ పర్యటన కీలక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశం-ఫ్రాన్స్ లు ఇప్పటివరకు 35 కంటే ఎక్కువ వ్యూహాత్మక భాగస్వామ్యాలపై సంతకం చేశాయి.

Tags

Next Story