Turkish Technic: విమానం నిర్వహణలో తమ పాత్ర లేదన్న టర్కిష్ టెక్నిక్ కంపెనీ

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాద ఘటనలో తమ సంస్థ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను తుర్కియే ఖండించింది. కూలిన విమానానికి టర్కిష్ టెక్నిక్ సంస్థ నిర్వహణ (మెయింటెనెన్స్) చేపట్టిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తుర్కియేకు చెందిన కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలోని డిస్ఇన్ఫర్మేషన్ నిరోధక కేంద్రం ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం లండన్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ ప్రాంగణంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు నేలపై ఉన్న మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో, కూలిన విమానానికి టర్కిష్ టెక్నిక్ నిర్వహణ చేసిందన్న ప్రచారం కేవలం భారత్-టర్కీ సంబంధాలపై ప్రజాభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశించిన దుష్ప్రచారమేనని తుర్కియే ఆరోపించింది. "2024, 2025 సంవత్సరాల్లో ఎయిర్ ఇండియా మరియు టర్కిష్ టెక్నిక్ మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం, కేవలం B777 రకం వైడ్-బాడీ విమానాలకు మాత్రమే నిర్వహణ సేవలు అందిస్తున్నాము. ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఈ ఒప్పందం పరిధిలోకి రాదు. ఇప్పటివరకు, ఈ రకానికి చెందిన ఏ ఎయిర్ ఇండియా విమానానికీ టర్కిష్ టెక్నిక్ నిర్వహణ చేయలేదు" అని ఆ ప్రకటనలో వివరించింది.
కూలిన విమానానికి చివరిసారిగా ఏ సంస్థ నిర్వహణ చేసిందో తమకు తెలుసునని, అయితే అనవసరమైన ఊహాగానాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో ఆ వివరాలు వెల్లడించడం లేదని తుర్కియే పేర్కొంది. అంతర్జాతీయ వేదికపై తుర్కియే ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను నిరంతరం పర్యవేక్షిస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ విషాదకర విమాన ప్రమాదం పట్ల భారత ప్రజల దుఃఖంలో తాము హృదయపూర్వకంగా పాలుపంచుకుంటున్నామని తుర్కియే ప్రభుత్వం పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com