TAIWAN: యుద్ధానికి తైవాన్ సన్నద్ధం

విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా ఏ క్షణంలోనైనా దాడికి దిగవచ్చనే అనుమానంతో తైవాన్(Taiwan) అధికారులు పౌరులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తైవాన్‌పై కన్నేసిన డ్రాగన్( China attacks) ఎన్నోసార్లు దుందుడుకు చర్యలకు పూనుకుంది. స్వయం పాలిత ద్వీపమైన తైవాన్‌ను తమ భూభాగంగా పేర్కొంటున్న చైనా బలవంతంగానైనా తమ దేశంలో కలుపుకుంటామని ఇటీవల ప్రకటించింది. ఇలాంటి ప్రకటనలతో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తైవాన్ ప్రభుత్వం తమ దేశ పౌరులను హెచ్చరిస్తోంది. ఈ సందర్భంగా తైవాన్ 46వ వార్షిక వాన్ యాన్ ఎయిర్ రైడ్ డ్రిల్స్(Taiwan air raid drills) నిర్వహించారు. వైమానిక దాడులు జరిగినప్పుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పాటించాల్సిన చర్యలపై పౌరులకు మాక్ డ్రిల్(defense drills) ద్వారా ప్రత్యక్ష అవగాహన కల్పిస్తోంది.
విపత్తు సమయాల్లో పౌరులు వ్యవహరించాల్సిన తీరుపై తైవాన్ రాజధాని తైపీ నగరంలో అధికారులు కసరత్తు నిర్వహించారు. వార్షిక వాన్ యాన్ ఎయిర్ రైడ్ డ్రిల్స్‌లో భాగంగా మాక్ డ్రిల్ చేశారు. రైల్వే స్టేషన్‌పై శత్రువులు వైమానిక దాడి చేసినట్టు ప్రత్యక్ష డ్రిల్ చేపట్టారు. ఆ సమయంలో అగ్నిమాపక దళాలు ఎలా వ్యవహరిస్తాయి, క్షతగాత్రులను ఎలా తరలిస్తాయి, అగ్నికీలలను ఎలా అదుపు చేస్తాయన్న విషయాలను పౌరులకు కళ్లకు కట్టినట్టు చూపించారు. సోమవారం ప్రారంభమైన నలభై ఆరవ వాన్ యాన్ డ్రిల్స్ 27వ తేది వరకు కొనసాగనున్నాయి.
తరచూ తైవాన్ వైపు యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను పంపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తైవాన్ సమీపంలో యుద్ధ విన్యాసాలను కూడా చైనా నిర్వహించింది. ఈ నేపథ్యంలో చైనా ఏ సమయంలోనైనా దాడికి పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్న తైవాన్ డ్రాగన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.
కొన్ని రోజుల క్రితమే తైవాన్(Taiwan) వాయు క్షేత్రాన్ని చైనా యుద్ధ విమానాలు(China Fighter Jets) కమ్మేశాయి. డజన్ల కొద్ది విమానాలు.. తైవాన్‌ను విమానాలతో సీల్ చేసేశాయి. మిస్సైళ్లను మోసుకెళ్లిన యుద్ధ విమానాలు.. తైవాన్ ఆకాశ ప్రాంతాన్ని పూర్తిగా బ్లాక్ చేశాయి. చైనాకు చెందిన షాన్‌డాంగ్ యుద్ద నౌక .. తైవాన్ జలాల్లో సైనిక విన్యాసాలు(Drills) నిర్వహిస్తోంది. ఆదివారం కూడా భారీ స్థాయిలో చైనా సైనిక సత్తాను ప్రదర్శించింది.
తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్ అమెరికాలో పర్యటించడంతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. వెన్ పర్యటనపై ఆగ్రహంతో ఉన్న చైనా.. తైవాన్ వైపుగా యుద్ధ నౌకలు, దాదాపు 70 ఫైటర్ జెట్లను మోహరించింది. వీటిలో 45 ఫైటర్ జెట్‌లు చైనా, తైవాన్‌ను విడదీసే జలసంధిలోని మీడియన్ లైన్‌ను దాటి వచ్చాయని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com