US Mid Air Accident: అమెరికా విమాన ప్రమాదంలో మృతులు మొత్తం 67 మంది

అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీ కొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అక్కడి అగ్నిమాపక శాఖ చీఫ్ వెల్లడించారు. వాషింగ్టన్‌లోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 67 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతయ్యింది. కాన్సాస్‌లోని విచిట నుంచి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రాంతీయ విమానం రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులోని రన్‌వే 33పై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రన్‌వేకు అతి సమీపంలో, పోటోమాక్ నదిపైన ఎదురుగా ఆర్మీ శిక్షణ హెలికాప్టర్ రావడంతో రెండూ ఢీకొన్నాయి. ప్రమాదంలో విమానం, హెలికాప్టర్ ముక్కలయ్యి పోటోమాక్ నదిలో కూలిపోయాయి.
హెలికాప్టర్ సైతం తలకిందులుగా నేలకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు సైన్యం ధ్రువీకరించింది. వీరందరూ మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 27 మంది మృతదేహాలను వెలికితీసినట్టు తెలుస్తున్నది. మృతుల్లో అమెరికా, రష్యాకు చెందిన ఫిగర్ స్కేటింగ్ క్రీడాకారులు ఉన్నారు. అయితే, విమానంలో ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని స్పష్టం చేశారు. గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదం. విమానం తలకిందులుగా నది అడుగుభాగంలో కూరుకుపోయిందని, అక్కడికి దగ్గర్లోనే హెలికాప్టర్ శకలాలను కూడా గుర్తించామని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న జాన్ డొన్నెలీ తెలిపారు.
వైట్‌హౌజ్‌కు అతి సమీపంలో దూరంలో..
వాషింగ్టన్‌లోని వైట్‌హౌజ్, క్యాపిటల్ భవనానికి కేవలం మూడు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రపంచంలో అత్యంత నియంత్రణ కలిగిన గగనతలంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం. రన్‌వేకు 2,400 అడుగుల దూరంలో, భూమికి 400 అడుగుల ఎత్తులో, గంటకు 140 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు విమానంలోని రేడియో ట్రాన్స్‌పాండర్ డాటాను బట్టి తెలుస్తున్నది. ‘మీకు ఎదురుగా విమానం కనిపిస్తున్నదా?’ అని హెలికాప్టర్ పైలట్‌ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అడుగుతుండగానే ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ దుర్ఘటనతో అమెరికా దుఃఖంలో మునిగిపోయిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఎయిర్ కంట్రోలర్ల ఎంపికలో మాజీ అధ్యక్షులు ఒబామా, బైడెన్ అవలంభించిన విధానాల వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com