Nitrogen Gas Execution: అమెరికాలో నైట్రోజన్‌ గ్యాస్‌తో ఖైదీకి మరణ శిక్ష

Nitrogen Gas Execution:  అమెరికాలో  నైట్రోజన్‌ గ్యాస్‌తో ఖైదీకి మరణ శిక్ష
X
ప్రపంచంలోనే తొలిసారిగా..

డబ్బు తీసుకుని తన సహచరులతో కలిసి కిరాయికి ఒక మహిళను దారుణంగా చంపిన కేసులో అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్‌ గ్యాస్‌ ద్వారా మరణ శిక్ష అమలుచేశారు. ఇప్పటివరకూ వినియోగంలో ఉన్న ప్రాణాంతక ఇంజెక్షన్లకు బదులు మొదటిసారి నైట్రోజన్‌ వాయువును వాడారు. 1988లో ఓ మతాధికారి భార్యను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కెన్నెత్ స్మిత్‌కు అలబామాలోని హోల్‌మన్ కారాగారంలో ఈ కొత్త పద్ధతిలో మరణశిక్ష విధించారు. కాగా, ఇలాంటి శిక్ష విధించడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

శిక్ష అమలు కోసం నైట్రోజన్ వాయువు మాత్రమే విడుదల చేసే ఓ మాస్క్‌ను ఖైదీ ముఖానికి తొడిగారు. దీంతో, అతడికి ప్రాణవాయువు అందక రెండు మూడు నిమిషాలు కాళ్లూచేతులూ ఆడిస్తూ గిలగిలాకొట్టుకున్నాడు. ఆ తరువాత మరికొన్ని నిమిషాలకు అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. మరణశిక్ష అమలకు మొత్తం 22 నిమిషాలు పట్టినట్టు తెలుస్తోంది.

కాగా, మరణ శిక్షను వీక్షించేందుకు నిందితుడి భార్య, బంధువులతో పాటూ కొందరు జర్నలిస్టులను కూడా అధికారులు అనుమతించారు. శిక్షకు ముందు కెన్నెత్ భార్యను చూస్తూ ఐ లవ్ యూ అని అన్నాడు. ఈ శిక్షతో అలబామా రాష్ట్రం మానవత్వాన్ని ఒక అడుగు వెనక్కు తీసుకెళ్లిందని అతడు చివరగా అన్నట్టు జర్నలిస్టులు చెప్పుకొచ్చారు.నైట్రోజన్ ద్వారా మరణ శిక్షను అమలు చేయడానికి వ్యతిరేకంగా చివరి నిమిషం వరకు న్యాయపోరాటం జరిగింది. కెన్నెత్ యూజీన్ స్మిత్ ను నైట్రోజన్ మరణ శిక్ష విధానానికి ప్రయోగ వస్తువుగా వాడుకుంటున్నారని అతడి తరఫు న్యాయవాదులు వాదించారు. ఇది క్రూరమైన చర్య అని, రాజ్యాంగ ఉల్లంఘన అని వాదించారు. ఈ విధానంపై సరైన పరిశోధనలు జరగలేదని, ఈ విధానాన్ని అమలు చేస్తున్న సమయంలో శిక్షకు గురవుతున్న వ్యక్తి అనుభవించే బాధ ఏ స్థాయిలో ఉంటుందన్న విషయంలో శాస్త్రీయ సమాచారం లేదని వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కానీ, చివరకు సుప్రీంకోర్టులో ఓడిపోయారు.

అయితే, నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష విధించడంపై అమెరికాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాస్త్రీయంగా పూర్తిస్థాయిలో పరీక్షించని ఈ కొత్త విధానాన్ని అమలు చేయడమంటే మనుషుల్ని గినీ పిగ్స్‌గా మార్చడమేనని కొందరు మండిపడ్డారు. అయితే, అలబామా రాష్ట్రం మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. మరణశిక్షకు సంబంధించి ఇంతకంటే మానవీయ విధానం మరొకటి లేదని తేల్చి చెప్పింది. కాగా, 1999లో చివరిసారిగా అమెరికాలో ప్రాణాంతకవాయువు ఉపయోగించి మరణ శిక్ష విధించారు. అప్పట్లో హైడ్రోజన్ సైనైడ్ వాడి ఓ హత్యకేసు దోషికి మరణ శిక్ష వేశారు.

Tags

Next Story